కోయంబత్తూర్: వచ్చే రెండేళ్లలో రెండు కొత్త మోడల్ కార్లను ఆవిష్కరించాలన్నది తమ లక్ష్యమని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హొల్లిస్ తెలిపారు. తద్వారా 2025 నాటికి ఏటా లక్ష కార్లు విక్రయించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చే ఏడాది మధ్యలో ‘న్యూ కరూఖ్ బ్రాండ్’, 2021లో మరొక మోడల్ కారు ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసుకున్నది స్కోడా ఆటో ఇండియా.

‘మేడిన్ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా 95 శాతం స్థానికంగానే కారు తయారీ ఉంటుందని ఇది తమ ‘భారత్ 2.0’ ప్రాజెక్టులో భాగమని జాక్ హొల్లిస్ తెలిపారు. గతేడాది స్కోడా ఆటో ఇండియా 17,244 కార్లు విక్రయించిందన్నారు. అందులో 48 శాతం దక్షిణాది రాష్ట్రాల్లో విక్రయించామన్నారు. 

2019లో దేశవ్యాప్తంగా 18 వేల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత నాలుగు నెలలుగా సేల్స్ నెమ్మదించాయని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోల్లిస్ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నామన్నారు. 

చైనా తర్వాత భారతదేశంలో అతిపెద్ద కార్ల వర్క్ షాప్ తెరిచేందుకు రూ.8000 కోట్ల నిధులను స్కోడా ఆటో ఇండియా పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. భారతదేశంలో మౌలిక వసతుల కల్పన సరిగ్గా జరిగిన మరుక్షణం తాము విద్యుత్ వినియోగ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెడతామని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోల్లిస్ చెప్పారు. 

దక్షిణాది రాష్ట్రాల్లో కార్ల విక్రయాలు సుమారు 50 శాతంగా ఉంటున్నా ఉత్సాదక యూనిట్ ఏర్పాటు చేసే ఆలోచనే లేదని స్కోడా ఆటో ఇండియా స్పష్టం చేసింది. అయితే దక్షిణ భారతదేశంలో వచ్చే మూడేళ్లలో 50 నగరాల పరిధిలో డీలర్లను రెట్టింపు చేయాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 

త్వరలో ఏర్పాటు చేసే వర్క్ షాప్ 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 50 బేల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏటా 20 వేల స్కోడా కార్లకు సర్వీసింగ్ అందించే వెసులుబాటు కల్పిస్తుంది.