న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్రెంచ్‌ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ కూడా వచ్చే ఏడాది నుంచి భారత్‌లో డీజిల్ వాహనాల విక్రయాలను నిలిపి వేస్తామని ప్రకటించింది. బీఎస్-6 ప్రమాణాల దెబ్బకు ఇప్పటికే ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ తన డీజిల్ కార్లకు గుడ్‌బై పలుకుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 


కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వాహన సంస్థలు డీజిల్ వాహనాల ఉత్పత్తిని వదిలేయాలని చూస్తున్నాయి. కాంప్యాక్ట్ మల్టీ-పర్పస్ వాహనం ట్రైబర్‌ను ఢిల్లీలో ఆవిష్కరించిన రెనాల్ట్ సీఈవో తెర్రీ బలోరే మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ ట్రైబర్‌ను పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే రూపొందించినట్లు, భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని సైతం విడుదల చేసే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు. 

 

వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారత్ స్టేజ్-6(బీఎస్-6) ప్రమాణాలకు లోబడి తయారు చేసిన వాహనాలను మాత్రమే విక్రయించాలని నిబంధనలు అమలులోకి రానున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీకి చెందిన డీజిల్ వాహన విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టాయని, దీంతో వీటి ఉత్పత్తిలో కోత విధించినట్లు రెనాల్ట్ సీఈవో తెర్రీ బలోరే చెప్పారు. 

 

యూరప్‌లో ఇప్పటికే డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం జరిగిందని, దీంతో యూరో-7 ప్రమాణాలతో కూడిన వాహనాలను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు రెనాల్ట్ సీఈవో తెర్రీ బలోరే ప్రకటించారు. చాలా దూరం ప్రయాణం చేసే వారి కోసమే ఈ డీజిల్ వాహనాలు అవసరమని, నగరాల్లో నడిపించేవారికి అనవసరమని, భవిష్యత్‌లో ఎల్‌సీవీల స్థానంలో ఈవీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.