ఫియట్‌ క్రిస్లర్‌తో విలీనంపై చర్చలు ప్రారంభించే అంశంపై రేనాల్ట్‌ నేడు నిర్ణయం తీసుకోనుంది. ఈ రెండు విలీనమైతే ఏర్పడే సరికొత్త సంస్థ అమెరికా, యూరప్‌, జపాన్‌ మార్కెట్‌ను ఏలుతుందని భావిస్తున్నారు. 

 

అమెరికా-ఇటలీకి చెందిన ఫియట్‌ క్రిస్లర్‌ గతవారం రెండు సమాన సంస్థల విలీన ప్రతిపాదనను రేనాల్ట్‌ ఎదుట ఉంచింది. దీనికి  షరతులతో కూడిన అనుమతిని ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఇచ్చింది. ‘‘ఈ విలీనం ఫ్రాన్స్‌ ఆటోమొబైల్‌ పరిశ్రమకు మంచి అవకాశం’’ అని ఫ్రాన్స్‌ మంత్రి బ్రూనో లి మైరీ తెలిపారు. ఈ రెండు బ్రాండ్లు విలీనమైతే ఆల్ఫా రోమియో, జీప్‌, మాసెరటీ వంటి ప్రీమియం కార్లను కలిసి మార్కెటింగ్‌ చేయవచ్చు. ఈ రెండు సంస్థలు  కలిసి 8.7 మిలియన్‌ వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటి సంయుక్త మార్కెట్‌ 36 బిలియన్‌ యూరోలు. 


ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయి. జూన్‌ 4న చర్చలను అధికారికంగా చేపట్టాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే రేనాల్ట్‌ జపాన్‌కు చెందిన మిత్సుబిషీతో జట్టుకట్టింది. ఇప్పుడు ఫియట్‌తో కూడా ఒప్పందం కుదిరితే వీరు 15 మిలియన్ల వాహనాలను విక్రయిస్తున్నట్లు అవుతుంది. ఇది ఫోక్స్‌వేగన్‌,  టయోటా కంటే చాలా ఎక్కువ.