Asianet News TeluguAsianet News Telugu

ఎన్‌ఫీల్డ్‌ ‘పేటెంట్‌’ఉల్లంఘన: అమెరికాలో ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ పిటిషన్.. ఈయూలోనూ

ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ పేటెంట్ ఉల్లంఘించిందని పుణె కేంద్రంగా పని చేస్తున్న ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ ఆరోపించింది. విద్యుత్ నియంత్రణకు ఉపయోగించే రెగ్యులేటర్ రెక్టిఫయర్ పరికరంపై తమకు పేటెంట్ ఉన్నా.. తమను సంప్రదించకుండానే వాడుతున్నదని ఆరోపించింది. 

Patent infringement case against Royal Enfield
Author
New Delhi, First Published May 21, 2019, 11:02 AM IST

న్యూఢిల్లీ: ఐచర్‌ మోటార్స్‌కు చెందిన రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు వ్యతిరేకంగా అమెరికా న్యాయ స్థానంలో ఆటో విడిభాగాల తయారీ సంస్థ ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా పేటెంట్‌ ఉల్లంఘన కేసు దాఖలు చేసింది. ద్విచక్ర వాహనంలో వినియోగించే ఓ ఉపకరణం పేటెంట్‌ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఉల్లంఘించినట్టు ఆరోపించింది. 

ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌కు రెగ్యులేటర్‌ రెక్టిఫయర్‌ డివైజ్, అవుట్‌పుట్‌ ఓల్టేజ్‌ రెగ్యులేటింగ్‌ విధానానికి అమెరికా పేటెంట్, ట్రేడ్‌ మార్క్‌ ఆఫీసు జారీ చేసిన పేటెంట్‌ ఉంది. దీన్ని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఉల్లంఘించినట్టు ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. 

యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, నెదర్లాండ్స్, స్వీడన్, స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, టర్కీలోనూ ఈ ఉపకరణంపై తమకు పేటెంట్‌ ఉన్నదని ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. కనుక  ఈ దేశాల్లోనూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు వ్యతిరేకంగా ఇదే తరహా వ్యాజ్యాలను దాఖలు చేయనున్నట్టు ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా తెలిపింది.

ఆటోమొబైల్‌ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థగా ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఈ తరహా అనూహ్య, అసాధారణ చర్యకు పాల్పడడం, దానిపై తాము పోరడాల్సి రావడం దురదృష్టకరం అని ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఎండీ సంజీవ్‌ వాసుదేవ్‌ పేర్కొన్నారు. దీన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకుందామని 2018 అక్టోబర్‌ 12న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులను సంప్రదించినా పరిష్కారం లభించలేదన్నారు. 

పేటెంట్‌ ఉల్లంఘనకు ముగింపు పలికి, తమకు పరిహారం చెల్లించే వరకు ప్రపంచవ్యాప్తంగా దీనిపై పోరాడతామని  ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఎండీ సంజీవ్‌ వాసుదేవ్‌ పేర్కొన్నారు. విద్యుత్ నియంత్రణకు సంబంధించిన రెగ్యులేటర్‌ రెక్టిఫైయర్‌ డివైస్‌ అనే ఎలక్ట్రానిక్‌ పరికర పనితీరుపై ఈ కేసును దాఖలు చేసినట్లు ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ తెలిసింది. కానీ ఆ పరికరాన్ని తమకు వేరే సంస్థ సరఫరా చేసిందని ఎన్‌ఫీల్డ్‌ పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios