క్లీన్ ఎనర్జీకే మొగ్గు.. ఎన్నికలపైనే ఆటోమొబైల్ ఆశలు
ప్రపంచంతోపాటు భారత దేశం కూడా క్లీన్ ఎనర్జీ వాహనాల వాడకం దిశగా అడుగులు వేస్తున్నది. బీఎస్- 6 వాహనాలను మాత్రమే 2020 నుంచి అనుమతినిస్తామని సుప్రీంకోర్టు తేల్చేయడంతో ఆయా ఆటోమొబైల్ సంస్థలు అందుకు అనుగుణంగా సన్నాహాలు చేసుకుంటున్నాయి.
చరిత్రగతిలో మరో వసంతం ముగిసిపోయి.. నూతన వసంతం అడుగిడనున్నది. ప్రతి ఒక్కరికీ ఆశలు ఉన్నట్లే నూతన వసంతంపై ఆటోమొబైల్ రంగం భారీగానే ఆశలు పెట్టుకున్నది. 2018లో కాలుష్య రహిత (క్లీన్ ఎనర్జీ) ఇంధనం వినియోగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వటంతో కంపెనీలు తమ భవిష్యత్ ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించాయి.
ఎన్నికలపై భారీగానే ఆశలు ఇలా
తాజాగా 2020 నుంచి భారత్ స్టేజ్-6 ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో అందుకు తగినట్లు ఆటోమొబైల్ రంగం సన్నద్ధం అవుతోంది. దీనికి తోడు కొత్త ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో వాహన విక్రయాలపై కూడా భారీగా ఆశలు పెట్టుకుంది.
బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల ఉత్పత్తికే మొగ్గు
బీఎస్ -6కు అనుగుణంగా వాహనాల ఉత్పత్తికి కంపెనీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటం ఆటోమొబైల్ రంగాన్ని మరింత కలవరపెడుతోంది.
2018లో హైబ్రిడ్, సీఎన్‌జీ, బయో ఫ్యూయల్స్ వాహనాలకు అమితమైన ఆదరణ లభించటంతో మారుతి సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, టొయోటా, హోండా ఇప్పటికే ఈ దిశగా వాహనాల తయారీకి సన్నాహాలు చేస్తునట్లు ప్రకటించాయి.
క్లీన్ ఎనర్జీకే ఆటోమొబైల్ సంస్థల పెద్దపీట
మరికొన్ని ఆటోమొబైల్ సంస్థలు కూడా క్లీన్ ఎనర్జీకి పెద్దపీట వేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని చేపట్టనున్నట్లు తెలిపాయి. 2020, ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి రానుండటంతో కొత్త ఏడాదిలో మార్కెట్లోకి కొత్త వాహనాల విడుదల పరిమితంగానే ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
విద్యుత్ వాహనాల నుంచి నుంచి క్లీన్ ఎనర్జీ వైపు
గత ఏడాది ప్రభుత్వం టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్ద పీట వేయగా తాజాగా క్లీన్ ఎనర్జీ ఫ్యూయల్‌కు ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రకటించింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చర్ ఆఫ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)-2 పథకం అమల్లోకి తేవటంలో జాప్యం నెలకొనటం ప్రభుత్వ లక్ష్యాలకు గండి పడినట్లయింది.
ద్వితీయార్థంలో అమ్మకాలు అంతంతే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆటోమొబైల్ విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవటం పరిశ్రమను కొంతమేరకు దెబ్బతీసింది. 2020 నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి రానుండటం కూడా పరిశ్రమను కొద్దిగా కలవరపెడుతోంది. నూతన ప్రమాణాలకు అనుగుణంగా కార్యకలాపాలను మార్చుకునేందుకు కొద్ది కాలంగా ఆటోమొబైల్ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి.
బీఎస్-6తోనే కొత్త ఉత్పత్తులన్నీ: మారుతి సుజుకి
కాగా వచ్చే ఏడాది నుంచి మారుతి సుజుకీ విడుదల చేసే వాహనాలన్నీ బీఎస్- 6 ప్రమాణాలతో ఉండే అవకాశాలు ఏన్నాయని కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. 2019 డిసెంబర్ నుంచి బీఎస్-4 వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఆయన చెప్పారు. బీఎస్-4 నుంచి బీఎస్-6కి మారే సమయంలో అమ్మకాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని భార్గవ తెలిపారు.
చిన్న డీజిల్ కార్ల విక్రయాలు తగ్గే అవకాశం
బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి రానున్న తరుణంలో చిన్న డీజీల్ కార్ల విక్రయాలు భారీగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. మొత్తం విక్రయాలపై దీని ప్రభావం ఉంటుందని అంచనా వేయలేమన్నారు.
మరోవైపు వాణిజ్య వాహనాలన్నీ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ర్చిదిద్దుతున్నట్లు టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గుంటెర్ బుట్చెక్ తెలిపారు. 2020, ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత బీఎస్-4 వాహన విక్రయాలను అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఉన్న ఇన్వెంటరీలను వదిలించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయన్నారు.
సవాళ్లు తప్పవన్న సియామ్
2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 నిబంధనలు అమల్లోకి రానుండటంతో ఆటోమొబైల్ రంగం కొన్ని సవాళ్లను ఎదుర్కొన తప్పదని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ అన్నారు. నియంత్రణ పరమైన ఆంక్షలను అధిగమించటంతో పాటు వాటిని తీర్చేందుకు కంపెనీలు ఇబ్బందులు పడకతప్పదన్నారు.
వచ్చేనెలలో మార్కెట్లోకి టాటా హారియర్
టాటా మోటార్స్‌కు చెందిన సరికొత్త ఎస్‌యూవీ ‘టాటా హారియర్’ వచ్చే నెల 23వ తేదీన మార్కెట్లోకి విడుదల కానున్నది. దేశవ్యాప్తంగా ఒకే రోజు ఈ కారును విడుదల చేయనున్నట్లు, తొలి కస్టమర్‌కు అదే రోజున కారును అందజేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.16 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం.