న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ జనవరి నుంచి ‘రతన్ టాటా’ మానసపుత్రిక ‘నానో’ (బుల్లి) కారు ఉత్పత్తిని నిలిపివేసింది. గత ఫిబ్రవరి నుంచి ఒకే ఒక్క కారు అమ్ముడు పోయిందంటూ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే టాటా మోటార్స్.. తమ ఎంట్రీ లెవెల్ కారు ‘నానో’ ఉత్పత్తి నిలిపివేయాలని ప్రాథమికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వివరించింది. 

ప్రారంభ దశలో నానో కారును ‘పీపుల్స్ కారు’ అని అంతా పిలిచేవారు. డిమాండ్ ఉన్నంత కాలం నానో కారును విక్రయించింది టాటా మోటార్స్. చివరిసారిగా గతేడాది డిసెంబర్ నెలలో గుజరాత్ రాష్ట్రం సనంద్ యూనిట్ నుంచి 82 నానో కార్లను టాటా మోటార్స్ ఉత్పత్తి చేసింది. తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు టాటా నానో కారు ఉత్పత్తి లేనే లేదు. 

జనవరి - జూన్ మధ్య కాలంలో ఫిబ్రవరిలో మాత్రమే ఏకైక నానో కారు అమ్ముడు పోయింది. తాము వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా కార్లను విక్రయిస్తామని, నానో ఉత్పత్తిని అధికారికంగా నిలిపేయలేదని టాటామోటార్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

జనవరి -జూన్ మధ్య కాలంలో విదేశాలకు టాటా నానో కార్ల ఎగుమతి కూడా లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ -6 ప్రమాణాలను అమలు చేయనున్న నేపథ్యంలో రతన్ టాటా డ్రీమ్ కారుగా పేర్కొన్న నానో మోడల్ కారు ఉత్పత్తిని నిలిపేయాలని టాటా మోటార్స్ సంకేతాలిచ్చింది. 

సేఫ్టీ రెగ్యులేషన్స్‌కు అనుగుణంగా నానో కారులో మార్పులు చేయాలంటే తడిసిమోపెడవుతుందని పేర్కొంది. ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. గతేడాది జూన్ నెలలో ఒక కారును ఉత్పత్తి చేసిన టాటా మోటార్స్, మూడు యూనిట్లను విక్రయించింది. నాటి నుంచి నానో కార్ల ఉత్పత్తిని సంస్థ యాజమాన్యం వినియోగదారుల డిమాండ్‌ను బట్టి చేపట్టింది. 

2008 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోకు రతన్ టాటా సొంతంగా ‘నానో’ కారు నడుపుకుంటూ వచ్చి దాని స్పెషాలిటీ ప్రజలకు చాటి చెప్పారు. 2009 మార్చి నుంచి మార్కెట్లోకి అడుగు పెట్టిందీ నానో కారు. బుల్లి కారును ప్రారంభ దశలో రూ. లక్షకే వినియోగదారులకు అందజేసింది టాటా మోటార్స్. అప్పట్లో లక్ష రూపాయలకే టాటా నానో కారు విక్రయిస్తామని ప్రజలకు రతన్ టాటా హామీ ఇచ్చారు. తర్వాత కార్ల ఉత్పత్తి ప్రత్యేకించి ‘నానో’ ప్రొడక్షన్ వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగినా ‘ప్రజలకిచ్చిన హామీ హామీ’యే దాన్ని దాటవేసే ప్రసక్తే లేదని రతన్ టాటా పట్టుదలగా వ్యవహరించారు.