Asianet News TeluguAsianet News Telugu

బీఎస్ - 6ప్లస్ విద్యుత్ వెహికల్స్ అంటే తడిసిమోపెడే

ఇప్పటివరకు కాలుష్య నియంత్రణకు దేశంలో ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమకు బీఎస్‌-6 నిబంధనలను అందుకోవడమే పెద్ద సమస్య. కానీ ఇప్పుడు మరో కొత్త సవాలు ఎదురు కాబోతోంది. విద్యుత్ వాహనాల తయారీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడమే ఆ సవాల్. ఇంకా బీఎస్‌-6 ప్రమాణాలు అమల్లోకి రాకముందే ఈ వాహనాలపై ప్రభుత్వం కసరత్తు చేపట్టటం పరిశ్రమ వర్గాలకు మింగుడు పడటం లేదు. అసలు సంగతేమిటంటే విద్యుత్ వాహనాల తయారీ వ్యయం పెరిగితే దాని ప్రభావం వాటి ధరలపై పడుతుంది. అటువంటప్పుడు విక్రయాలు తగ్గుతాయని, తద్వారా తమ లాభాలు పడిపోతాయని ఆటో దిగ్గజాల అసలు ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది.

NITI Aayog's electric mobility proposal irks India's auto industry
Author
New Delhi, First Published Jun 14, 2019, 10:41 AM IST

న్యూఢిల్లీ: ఉద్గారాల నియంత్రణ ద్వారా పూర్తిగా వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలనే అనుమతించే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అసలు ప్రపంచమంతా ఎలక్ట్రిక్‌ వాహనాల దిశగా శరవేగంగా దూసుకెళ్తుంటే.. మనదేశం మాత్రం ఇంకా పెట్రోలు, డీజిల్‌ యుగంలోనే ఉంది. దీన్ని కేంద్రం గుర్తించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి, వాడకంపై దృష్టి సారించింది.

తొలుత 2030 నాటికి దేశంలో పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించుకున్నా..ఇంకా ముందే 2026 నాటికే వీటిని తేవాలని భావిస్తోంది. ఈ విషయంలో ‘నీతి ఆయోగ్‌’ కొన్ని అధ్యయన పత్రాలూ తెచ్చింది. 

అంతేగాక 150 సీసీ లోపు ఇంజిన్ల ఉపయోగాన్ని నిలిపివేసి ఆ స్థానంలో బ్యాటరీతో పనిచేసే విద్యుత్ ఇంజిన్ల వాడకాన్ని అనుమతించాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ద్విచక్ర వాహనాలు.. మోటార్ బైక్‌లు, స్కూటర్లు, మూడు చక్రాల ఆటోలు పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారాల్సిందే. అదే జరిగితే ద్విచక్ర వాహన కంపెనీలకు పెను సవాలే అవుతుంది. ఆయా సంస్థలకు పెట్టుబడి వ్యయం తడిసి మోపెడవుతుంది.

పూర్తిస్థాయి విద్యుత్ వాహనాలను విపణిలోకి తేవాలంటే ప్రస్తుతం ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామి కంపెనీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీలో ఎన్నో చిన్న సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి కానీ పెద్ద కంపెనీలు అటు వైపు అడుగులు వేయలేదు. అందుకే ఆయా కంపెనీల ప్రతినిధులు తమకు సమయం సరిపోదని చెబుతున్నారు. ప్రత్యేకించి హీరో మోటో కార్ప్స్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో సంస్థల అధినేతలు రియలిస్టిక్ పాలసీతో సర్కార్ ముందుకు రావాలని తమ డిమాండ్లను అభ్యర్థనల రూపంలో వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే తామంతా బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టి వాహనాల ఉత్పత్తి కోసం సన్నాహాలు చేస్తుంటే, మళ్లీ ఇంతలోనే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు వెళ్లటం ఎలా సాధ్యమనే ప్రశ్న సంధిస్తున్నారు. సంబంధిత అన్ని వర్గాలతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు చేపట్టకుండా ఈ విషయంలో ముందుకు వెళ్లరాదని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. ఈ అంశంపై ఇటీవల నీతి ఆయోగ్‌ నిర్వహించిన సమావేశంలో ద్విచక్ర వాహన తయారీ కంపెనీల ప్రతినిధులు తమ ఆందోళన వ్యక్తం చేశారు కూడా.

ప్రపంచ దేశాలన్నీ వాయు కాలుష్య నియంత్రణ కోసం వాహనాలు వినియోగించే వారికి కఠిన కాలుష్య ప్రమాణాలను అమలు చేస్తున్నాయి. ఈ దిశగా బీఎస్‌-6 నిబంధనలు తేవాలని కేంద్ర ప్రభుత్వం 2016లోనే నిర్ణయించినా.. అందుకు అవసరమైన సన్నాహాల కోసం 2020 ఏప్రిల్‌ 1వ తేదీ వరకు గడువిచ్చింది. దీనికి ఇంకా తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉంది. ఇందుకు దేశీయ ద్విచక్ర వాహన కంపెనీలు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నాయి.

నూతన కాలుష్య నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌ను తీర్చిదిద్దటం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకు ఆయా కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. అందువల్ల వచ్చే ఏడాది ఏప్రిల్‌ తర్వాత విక్రయించే స్కూటర్లు, మోటార్‌ సైకిళ్ల ధర కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దానివల్ల తొలి దశలో అమ్మకాలు తగ్గవచ్చు. వినియోగదార్లు ఆచితూచి కొనుగోళ్లు  చేస్తారు. ఇది పరిశ్రమ మీద కొంత వ్యతిరేక ప్రభావం చూపుతుందనే అభిప్రాయం ఉంది.

ఏ పని చేపట్టాలన్నా.. పెద్దగా ఆలోచించి మడమ తిప్పకుండా ముందుకు వెళ్లాలంటే చైనా తర్వాతే ఏ దేశానికైనా సాధ్యం. ఆకాశం నుంచి నేల మీదకు చూస్తే సన్నని గీతలా కనిపించే చైనా గోడను ఎన్నో వందల ఏళ్ల క్రితమే నిర్మించిన ఆ దేశం మౌలిక వసతులు, ఎలక్ట్రానిక్‌, సౌర విద్యుత్తు రంగాల్లో విశేషమైన ప్రగతి సాధించింది. అదే జోరులో వాహన రంగాన్ని పెట్రోలు, డీజిల్‌కు బదులు పూర్తిగా ఎలక్ట్రిక్‌ వైపు మళ్లించింది.

ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఎంతో సంక్లిష్టమైన బ్యాటరీ తయారీ పరిజ్ఞానంపై చైనా పట్టు సాధించింది. దీంతో చిన్న వాహనాల నుంచి బస్సులు, ట్రక్కులు వంటి భారీ వాహనాలు సైతం ఆ దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారిపోయాయి. తద్వారా వాహన కాలుష్యం ఎంతో అదుపులోకి తెచ్చింది.. ఆ స్పూర్తితోనైనా మనదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నిపుణులు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంవైపు అడుగులు వేసే దిశగా పలు సవాళ్లు ఉన్నాయని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు పేర్కొంటున్నాయి. తయారీ పరిజ్ఞానం, ముఖ్యంగా బ్యాటరీ టెక్నాలజీపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అందుకు ఎంతో సమయం కావాలని, ఇప్పటికిప్పుడు భారీ పెట్టుబడులు సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నాయి. 

ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే, ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలిగే బ్యాటరీలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇదే ప్రధాన అడ్డంకి అని చెబుతున్నారు. దీనికి తోడు మనదేశంలో ఛార్జింగ్‌ వసతుల్లేవు. పూర్తి స్థాయిలో ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయటానికి సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడు అంటే ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ విడిభాగాలు, బ్యాటరీలను దిగుమతి చేసుకోవలసి వస్తుంది. వాటిని పూర్తిగా దేశీయంగా తయారు చేసుకోవడానికి ఎంతో సమయం పడుతుంది.

1950-60 దశకాల్లో స్కూటర్ల మార్కెట్‌ను శాసించిన బ్రాండ్లలో లాంబ్రెట్టా ఒకటి. పొడవుగా, దర్జాగా ఉండే ఈ ఇటాలియన్‌ బ్రాండ్‌ స్కూటర్‌ అప్పట్లో  మనదేశంలో ఎంతోమంది యువతీ, యువకుల మనసును కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత స్కూటర్ల డిజైన్‌లో, ఇంజిన్‌ టెక్నాలజీలో మార్పులకు తట్టుకోలేక కనుమరుగైంది. అప్పటి నుంచి బజాజ్‌ ఏకఛత్రాధిపత్యం వహించిన విషయం విదితమే. మధ్యలో ఎల్‌ఎంఎల్‌ వెస్పా నుంచి కొంత పోటీ వచ్చినా బజాజ్‌ స్కూటర్‌కు ఎదురే లేని పరిస్థితి. 

మళ్లీ ఇప్పుడు హోండా, టీవీఎస్‌, సుజుకీ తదితర స్కూటర్లకు ఆదరణ లభిస్తోంది. మళ్లీ దేశీయ స్కూటర్ల మార్కెట్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న లాంబ్రెట్టా, అందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. సంప్రదాయ పెట్రోలు స్కూటర్‌ కాక పూర్తిగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌తో రావాలని సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో లాంబ్రెట్టా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఆవిష్కరించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే నాలుగైదు దశాబ్దాల తర్వాత కొత్త రూపం, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో లాంబ్రెట్టా మళ్లీ మనదేశంలో అడుగుపెట్టినట్లవుతుంది.

ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని అధికం చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఇప్పటికే ఫేమ్‌-2 (ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మాన్యుఫ్యాక్చర్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఛార్జింగ్‌ వసతులు నెలకొల్పటానికి కేంద్రం రూ.10,000 కోట్లు ప్రతిపాదించింది. అంతేగాకుండా ఎలక్ట్రిక్‌ వాహన తయారీదార్లకు సబ్సిడీలు, రాయితీలు ఉన్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీలో నిమగ్నమైన సంస్థలకు ఈ పథకం ఊతంగా నిలుస్తుందని, ఇతర సంస్థలు సైతం ఈ విభాగంలో అడుగుపెట్టటానికి ముందుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios