Asianet News TeluguAsianet News Telugu

10కే కాదు 12,500 మంది: భారత్‌లో 1700 మందికి నిస్సాన్ పింక్ స్లిప్స్?

రెనాల్ట్ సంస్థతో భాగస్వామ్య సంబంధాల్లో సమస్యలతోపాటు సంస్థ సీఈఓపై అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణల మధ్య నిస్సాన్ ప్రతిష్ఠ మసక బారింది. అమ్మకాలు తగ్గిపోవడంతో నిస్సాన్ యాజమాన్యం పొదుపు చర్యలు ప్రారంభించింది. 12,500 మంది ఉద్యోగుల తొలిగింపునకు సిద్ధం చేసింది. భారతదేశంలో 1700 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇవ్వనున్నట్లు సమాచారం.

Nissan quarterly net profit plunges, 12,500 job cuts planned
Author
Mumbai, First Published Jul 27, 2019, 3:06 PM IST

ముంబై: జపాన్ కార్ల తయారీ సంస్థ  నిస్సాన్ మోటార్స్ భారత్‌లోని ఉద్యోగుల మెడపై కత్తి పెట్టింది. ఏకంగా 1700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. నిస్సాన్ లాభాలు ఇటీవల దారుణంగా పడిపోవడంతో దశాబ్దకాల కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో పొదుపు చర్యలు నిస్సాన్ ప్రారంభించింది. 

నిస్సాన్ ప్రపంచ వ్యాప్తంగా 12,500 మందిని తొలగించాలని నిర్ణయించింది. తొలుత 10 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిస్సాన్ భావించింది. నిస్సాన్ యాజమాన్యం నిర్ణయం మేరకు భారత్‌ నిస్సాన్ యూనిట్‌లో 1700 మంది ఉద్యోగులు ఉన్నారు. త్వరలోనే వీరికి పింక్ స్లిప్‌లు ఇవ్వనున్నట్టు సమాచారం.
 
కాగా, ఇప్పటికే 6,400 మంది ఉద్యోగులను సెలవుపై వెళ్లాలని నిస్సాన్ ఆదేశించింది. మిగతా వారిని వచ్చే రెండు, మూడేళ్లలో తొలగించనుంది. టోక్యోలో జరిగిన కంపెనీ ఇన్వెస్టర్ల సమావేశంలో ఈ సంగతి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇవ్వనున్నట్టు తెలిపింది. 

ఇక, భారత్‌ను పక్కనపెడితే అమెరికాలో 1420 మంది, మెక్సికోలో వెయ్యిమంది, ఇండోనేషియాలో 830, జపాన్‌లోని 880 మంది ఉద్యోగులను నిస్సాన్ ఇంటికి పంపాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో గతేడాది సెప్టెంబర్ నెలలోనే నిస్సాన్ మోటార్ ఇండియా ‘ఎంప్లాయీస్ వాలంటరీ సెపరేషన్ స్కీం’ను ప్రకటించింది. ఆరు నెలల క్రితమే ఇందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

అంతే కాదు నిస్సాన్ 2022 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి గ్లోబల్ ప్రొడక్షన్ 10 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది. 2018, 2019ల్లో 6,400 మంది ఉద్యోగులను ఇళ్లకు పంపించేసింది నిస్సాన్. 2020 -22 మధ్య మరో 6,100 మందిని సాగనంపాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 

భారతదేశంలో సంస్థ తొలి త్రైమాసికం ఫలితాలు కష్టంగా ఉన్నాయని నిస్సాన్ ఇండియా సీఈఓ హిరోటో సైకావా తెలిపారు. రెండో, మూడో త్రైమాసికం కల్లా పుంజుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios