Asianet News TeluguAsianet News Telugu

కర్బన ఉద్గారాల నియంత్రణే లక్ష్యం: నూతన ఆటో పాలసీ రెడీ

వాహనాల నుంచి కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించడానికి అమలు చేయాల్సిన నూతన జాతీయ ఆటో విధానం సిద్ధంగా ఉన్నదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు

New National Auto Policy coming soon: Minister
Author
Mumbai, First Published Sep 6, 2018, 11:26 AM IST

వాహనాల నుంచి కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించడానికి అమలు చేయాల్సిన నూతన జాతీయ ఆటో విధానం సిద్ధంగా ఉన్నదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే తెలిపారు. గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులేయాల్సి ఉన్నదన్నారు. సెంటర్స్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికిల్స్ (ఫేమ్) కార్యక్రమం వచ్చే డిసెంబర్ నెలతో ముగుస్తుందని స్పష్టం చేశారు.

బుధవారం ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఎ) వార్షిక సమావేశాన్ని ప్రారంభిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే సంబంధిత పరిశ్రమ ఆకాంక్షలకు ఆ విధానంలో చోటు కల్పిస్తామని, అందుకోసం సలహాలను స్వీకరిస్తామని చెప్పారు. 

అయితే భారీ పరిశ్రమలమంత్రిత్వశాఖ గత ఆరు నెలలుగా వివిధ వాటాదారులతో నూతన ఆటో పాలసీపై చర్చలు జరుపుతూనే ఉంది. ఆటోమొబైల్ పరిశ్రమకు నోడల్ నియంత్రణ సంస్థ ఒక్కటి అవసరం ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నదని అధికార వర్గాలు తెలిపాయి.

ఇంతకుముందు విడుదల చేసిన ముసాయిదాలో సంబంధిత ఆటో విడిభాగాలపై జీఎస్టీ హేతుబద్ధీకరించాలని, వాహనం పొడవు, కర్బన ఉద్గారాల స్థాయిని బట్టి ఖరారు చేయాలన్న సిఫారసు చేశారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ‘ఫేమ్1’ గడువు ముగుస్తుంది. ఫేమ్ 2 విధానాన్ని వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి తెస్తుందని కేంద్ర మంత్రి అనంత్ గీతే తెలిపారు. 

ఆటోమొబైల్ విధానం స్పష్టంగా, స్థిరమైనదిగా ఉండాలని వాహన పరిశ్రమ అధినేతలు అభిప్రాయపడ్డారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాతిపదికన విధానాలు తీసుకొస్తే అందుకు తగినట్లు తాము ప్రణాళికలు సిద్ధం చేసుకునే వీలుంటుందని సూచించారు. అంతేకాని నియంత్రణపరమైన మార్పులు చేసిన ప్రతీసారి అది పరిశ్రమ సంక్షోభ స్థితికి దారి తీయకూడదని అన్నారు. ఈ సమావేశానికి మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ తదితర దిగ్గజ వాహన కంపెనీల అధినేతలు హాజరయ్యారు. 

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ ‘సర్కార్ మా ముందు దీర్ఘకాలిక ప్రణాళిక ప్రభుత్వం ఉంచాలి. అప్పుడే నియంత్రణతో కూడిన మార్పులకు  సిద్ధపడేందుకు మాకు వీలుంటుంది. నియంత్రణతో కూడిన మార్పులు పరిశ్రమ సంక్షోభానికి దారితీయకూడదు. ఉదాహరణకు బీఎస్‌-4 నిబంధనలను అమలు చేసినప్పుడు వాహన పరిశ్రమపై ఎలాంటి ప్రభావం పడిందో మనకు తెలుసు. త్వరలోనే బీఎస్‌-6 నిబంధనలను కూడా ప్రభుత్వం అమల్లోకి తేనుంది.

నియంత్రణపరమైన మార్పుల విషయంలో పరిశ్రమకు తగినంత సమయం ఇవ్వడం లేదనే అభిప్రాయం అంతేకాకుండా నియంత్రణపరమైన మార్పులు, కొత్త సాంకేతికత ప్రవేశపెట్టేటప్పుడు స్థానిక తయారీ, ఉద్యోగ సృష్టిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అనే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని స్పష్టం చేశారు.

మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఆయుకవా మాట్లాడుతూ ‘భవిష్యత్‌లో వాహన రంగంలో జరిగే మార్పులకు తగినట్లు స్థిరమైన, స్పష్టమైన విధానాలను ప్రభుత్వం తేవాలి. అసలు పరికరాల తయారీదార్లకు, వాహన విడిభాగాల తయారీదార్లకు సాంకేతికతలే అతిపెద్ద పెట్టుబడులు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక విధానాలను తేవడం వల్ల సామర్థ్య ప్రణాళికను రూపొందించేందుకు, పెట్టుబడుల సమీకరణకు ఉపయోగపడుతుంది. స్ధిరమైన విధానాలు కంపెనీల ప్రధాన వాటాదార్లలో ఉత్సాహం నింపుతుంది’ అని తెలిపారు.

టాటా మోటార్స్ ఎండీ గుంటేర్ బషెక్ మాట్లాడుతూ ‘భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి చురుకైన విధానాల అమలు ద్వారా ప్రభుత్వం తోడ్పాటునివ్వాల్సిన అవసరం ఉంది. దీంతో ప్రాధాన్యాలేవో గుర్తించి వనరులను సరైన మార్గంలో వినియోగించే వీలు ఉంటుంది.

ఇంధన భద్రతా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతికత తటస్థ వైఖరిని భారత్‌ అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రిక్‌, హైబ్రీడ్‌, సీఎన్‌జీ, మిథనాల్‌, ఇథనాల్‌ సహా అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏదేని కొత్త సాంకేతికతను అనుసరించే ముందు అందుకు తగినట్లు మౌలిక వసతులను ఏర్పాటుచేసుకోవడం ముఖ్యం’ అని వివరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios