న్యూఢిల్లీ: కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా వాహనాల తయారీలో కుదురుకోవడానికి సమయం పడుతుందని జపాన్‌ ఆటోమొబైల్ దిగ్గజం హోండా పేర్కొన్నది. 

అలాంటప్పుడు వెంటనే విద్యుత్‌ వాహనాలకు మారడమంటే ద్విచక్ర వాహనాల పరిశ్రమకు ఇబ్బందేనని తెలిపింది. అందువల్ల విద్యుత్‌ వాహనాలకు మారేందుకు మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని హోండా మోటార్ సైకిల్స్ బైక్స్ కార్పొరేషన్ తెలిపింది. 

150 సీసీ లోపు సామర్థ్యం సంప్రదాయ ద్విచక్ర వాహనాల్లో ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్లను 2025 కల్లా పూర్తిగా నిషేధించాలని నీతి ఆయోగ్‌ చేసిన ప్రతిపాదనను ఇప్పటికే హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ సంస్థల యాజమాన్యాలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా హోండా కూడా వీటికి జత కలిసింది. 

నీతిఆయోగ్‌ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి ముందు సంబంధిత వాటాదార్లందరితో సంప్రదించి ఒక ప్రణాళికను రూపొందించాలని హోండా సూచించింది. ప్రస్తుతం హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) ద్వారా హోండా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

విద్యుత్‌ వాహనాల అభివృద్ధి, అమ్మకాలకు సంబంధించి తమకు 25 ఏళ్ల అనుభవం ఉన్నా.. ఆ తరహా వాహన విధానాన్ని అందుపుచ్చుకోవడమంటే వివిధ కారణాల రీత్యా సవాలుతో కూడుకున్న పనే అని హోండా పేర్కొంది. 

‘బీఎస్‌-6కి మారాక మలిదశ మార్పులో భాగంగా విద్యుత్‌ వాహన విధానాన్ని అందిపుచ్చుకునేందుకు పరిశ్రమకు మరింత సమయం అవసరం. ముఖ్యంగా భారత వినియోగదారుల అవసరాలను, ధరల్లో వచ్చే మార్పుచేర్పులను, రోజులో ప్రయాణించే దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అంత తక్కువ సమయంలో కుదురుకోవడం కష్టం’అని హెచ్‌ఎంఎస్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

వాయు కాలుష్యం, సాంకేతికత వ్యయాలు, ముడి సరుకుల లభ్యత, మౌలిక వసతులు, ఉద్యోగుల ప్రభావం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటాదార్లతో సంప్రదించి ఒక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేయాలని హోండా కోరింది. ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ నుంచి మరో అడుగు ముందుకు వేయడానికి సమయం పడుతుందని, ప్రత్యేకించి భారత వినియోగదారుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 

విద్యుత్ వినియోగ వాహనాల వైపు మళ్లించడం వల్ల నూతన ఉద్యోగాలు కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముడి సరుకు, మౌలిక వసతుల (చార్జింగ్ స్టేషన్ల) లభ్యత, టెక్నాలజీ వ్యయం, ఇంధన భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని హోండా కోరింది.