న్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ త్వరలో విపణిలోకి ఆవిష్కరించనున్న పూర్తిస్థాయి విద్యుత్ వినియోగ ఎస్‌యూవీ మోడల్ కారు ‘ఎంజీ ఈజడ్ఎస్’ కారును భారతదేశంలోనే ఉత్పత్తి చేయాలని సంకల్పించింది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎంజీ ఈజడ్ఎస్ కారును విపణిలోకి విడుదల చేయనున్నది. గుజరాత్ రాష్ట్రంలోని హలోల్‌లోని ఉత్పాదక యూనిట్‌లో ‘ఎంజీ ఈజడ్ఎస్’ మోడల్ విద్యుత్ కార్లను తయారు చేయనున్నది. 

భారతదేశంలోనే ఉత్పత్తి చేసి, దేశీయ విపణిలోకి విడుదల చేయనున్నతొలి విద్యుత్ కారు ఎంజీ మోటార్స్ వారి ‘ఎంజీ ఈజడ్ఎస్’ కానున్నది. త్వరలో భారత్ రోడ్లెక్కనున్న ఎంజీ హెక్టార్ తర్వాత దేశీయ విపణిలో ఆవిష్కరించనున్న ఎంజీ హెక్టార్ తర్వాత ‘ఎంజీ ఈజడ్ ఎస్’ మోడల్ కారు రెండోది కానున్నది. 

ఇప్పటికైతే ఎంజీ మోటార్స్.. తన ఎంజీ ఈజడ్ఎస్ మోడల్ విద్యుత్ కారులో వినియోగించే ఫీచర్ల స్పెషిపికేషన్స్ ఏమిటో వివరించలేదు. ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) టెక్నాలజీతోపాటు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 300కి పైగా కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం గల లిథియం ఐయాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 

ఎంజీ మోటార్స్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా స్పందిస్తూ.. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఎంజీ ఈజడ్ఎస్ ఒకటి. పూర్తిగా ఎన్విరాన్ మెంట్ ఫ్రెండ్లీ మొబిలిటీ విభాగంలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. విద్యుత్ వాహనాల రంగంలో దేశంలో అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉన్నదని రాజీవ్ చాబా పేర్కొన్నారు.

ఎంజీ మోటార్స్ ఇండియా హలోల్ విద్యుత్ వాహనాల ఉత్పత్తి ప్లాంట్ కోసం రూ.2200 కోట్లు పెట్టుబడి పెట్టింది. న్యూ అసెంబ్లీ లైన్, ప్రెస్ షాప్, బాడీషాప్, పార్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ న్యూ ట్రైనింగ్ ఫెసిలిటీతోపాటు టెస్టింగ్ ట్రాక్‌ ఏర్పాటు చేసింది. సమీప భవిష్యత్‌లో మరిన్ని ఎంజీ మోటార్స్ భారతదేశంలోనే ఉత్పత్తి చేసేందుకు సిద్ధం అవుతోంది.