న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో మారుతీ సుజుకీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 31.67% క్షీణించింది. మారుతి సుజుకి నికర లాభం రూ.1,376.8 కోట్లకు పరిమితమైంది. సమీక్షా కాలానికి కార్ల విక్రయాలు తగ్గడంతోపాటు తరుగుదల వ్యయం పెరగడం ఇందుకు కారణమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం రూ.2,015.10 కోట్లుగా నమోదైంది. 

ఇదే త్రైమాసిక కాలంలో వాహనాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం రూ.18,738 కోట్లకు తగ్గింది. క్రితం ఏడాదిలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.21,813.80 కోట్ల ఆదాయంతో పోలిస్తే 14 శాతం తగ్గింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ తరుగుదల వ్యయాలు రూ.919 కోట్లకు పెరిగాయి.
 
జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో మారుతీ సుజుకీ స్టాండలోన్‌ లాభం 27.3 శాతం తగ్గి రూ.1,435 కోట్లకు జారుకుంది. ఏడాది క్రితం ఇదే సమయానికి రూ.1,975.30 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 14.1 శాతం తగ్గి రూ.18,735.2 కోట్లకు పరిమితమైంది.
 
గత మూడు నెలల్లో మారుతీ సుజుకీ వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 17.9 శాతం తగ్గి 4,02,594 యూనిట్లకు పడిపోయాయి. దేశీయంగా విక్రయాలు 19.3 శాతం పడిపోయి 3,74,481 యూనిట్లుగా నమోదయ్యాయి. 28,113 వాహనాలను ఎగుమతి చేసింది.
 
ప్రస్తుతం కంపెనీ తన మాతృ సంస్థ సుజుకీకి 45 శాతం మోడళ్లపై రాయల్టీని జపాన్‌ కరెన్సీ యెన్‌కు బదులు దేశీయ కరెన్సీ రూపాయల్లోనే చెల్లిస్తోందని మారుతీ సుజుకీ ఇండియా సీఎఫ్ఓ అజయ్‌ సేథ్‌ అన్నారు. వచ్చే మూడేళ్లలో (2021-22 నాటికి) మిగతా 55 శాతం మోడళ్లపైనా రాయల్టీని రూపాయల్లోనే చెల్లిస్తామన్నారు. 

జూన్‌ త్రైమాసికానికి నమోదైన నికర విక్రయాల్లో 5.2 శాతాన్ని మాతృసంస్థకు రాయల్టీగా చెల్లించడం జరిగిందని మారుతీ సుజుకీ ఇండియా సీఎఫ్ఓ అజయ్‌ సేథ్‌ పేర్కొన్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌-6 ప్రమాణాలను దృష్టిలో పెట్టుకునే కంపెనీ ముందుకు సాగుతోందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సీ అన్నారు. 

ఈ ఏడాది చివరికల్లా మెజారిటీ మోడళ్లను బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సీ చెప్పారు. ప్రస్తుతం అత్యదికంగా అమ్ముడవుతున్న ఐదు మోడళ్ల కార్లు.. ఆల్టో, వ్యాగన్‌, స్విఫ్ట్‌, డిజైర్‌, బాలెనోలను బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు కల్సీ వెల్లడించారు.
 
మారుతీ సుజుకీ ఇండియా సీఎఫ్‌ఓ అజయ్‌ సేథ్‌ స్పందిస్తూ ‘దేశీయ వాహన రంగంలో ప్రస్తుత మందగమనం మా కంపెనీపైనా ప్రభావం చూపింది. ఆటో ఇండస్ట్రీలో విక్రయాలు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది నాలుగో త్రైమాసికం. అయితే ఇది తాత్కాలిక పరిణామమే. దీర్ఘకాలంలో మార్కెట్‌ సామర్థ్యంపై ఆశావహంగా ఉన్నాం’ అని చెప్పారు. 

‘అర్బన్‌ మార్కెట్‌తోపాటు గ్రామీణ మార్కెట్లోనూ వాతావరణం నిరాశాజనకంగానే ఉంది. గ్రామీణ మార్కెట్లోనూ కార్ల విక్రయాలు 17 శాతం మేర తగ్గాయి. షోరూమ్‌ను సందర్శించే వారి సంఖ్య కూడా బాగా తగ్గింది’ అని మారుతి సుజుకి ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సీ చెప్పారు.