న్యూఢిల్లీ: దేశీయ ప్రయాణ వాహనాల తయారీ సంస్థ దిగ్గజం మారుతీ సుజుకీ తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నది. కార్ల విక్రయాలు తగ్గిపోవడంతో ఆ మేరకు ఖర్చులు తగ్గించుకుని, పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొంది. 

దేశంలో సగానికి పైగా ఆటోమొబైల్‌ పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోవడంతో కొలువుల కోత తప్పలేదని మారుతీ సుజుకి పేర్కొన్నది. 

ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ నాటికి కంపెనీ 18,845 మందిని నియమించుకున్నది. వీరిలో ఆరు శాతం 1,181 మందిని తగ్గించుకొంది. ఏప్రిల్‌ నుంచి ఉద్యోగాల కోతను వేగవంతం చేసినట్లు పేర్కొంది. దీంతోపాటు కొత్త ఉద్యోగులను తీసుకోవడాన్ని కూడా నిలిపివేసింది. 

కానీ తాము పర్మినెంట్‌ ఉద్యోగులను తగ్గించుకోలేదని మారుతీ వెల్లడించింది. సంస్థలో మరిన్ని ఉద్యోగాల్లో కోతలు ఉంటాయా? అనే అంశంపై స్పందించేందుకు మారుతి సుజుకి నిరాకరించింది. ఇప్పటికే ఉత్పత్తిని 10.3శాతం తగ్గించుకొన్నట్లు పేర్కొంది. 

దీనిపై మారుతి సుజుకి ఛైర్మన్‌ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ ‘ఉద్యోగుల కోత అంశం వ్యాపారం నెమ్మదించడాన్ని తెలియజేస్తోంది. అందుకే ఆటో మొబైల్‌ సంస్థలు కొంత తాత్కాలిక ఉద్యోగులను ఉంచుకోవడానికి ఇష్టపడతాయి’’ అని తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగ రేటు పెరిగి జులై నాటికి 7.51శాతానికి చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇది 5.66శాతంగా ఉండేదని సీఎంఐఈ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో రోజువారీ కూలీలను కలపలేదు.

ఆటో సేల్స్ పతనమైనా కొద్దీ ఈ రంగంలో ఉద్యోగాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నట్లేనని తెలుస్తోంది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఎ) స్పందిస్తూ ఆటోమొబైల్ విడి భాగాల తయారీ సంస్థల్లో పది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇదిలా ఉంటే తొలి ఆరు నెలల్లో మారుతి సుజుకి తన ఉత్పత్తిని 10.3 శాతం తగ్గించి వేసింది. కార్ల వినియోగదారుల్లో ప్రతి ఇద్దరిలో ఒక్కరు మారుతి సుజుకి కారు వాడుతున్నారు. గతేడాది జూలైలో 1,09,265 వాహనాలను విక్రయించిన మారుతి సుజుకి ఈ ఏడాది జూలైలో 33.5 శాతం విక్రయాలు తగ్గాయి. 

హర్యానాలోని మానెసర్ ఉత్పాదక యూనిట్‌లో కొన్ని రోజుల పాటు మూడు షిప్టులు తగ్గించి వేసింది మారుతి సుజుకి. మారుతి ఉద్యోగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుల్ దీప్ జంఘూ మాట్లాడుతూ తాత్కాలిక ఉద్యోగుల వేతనం నెలకు సగటున 250 డాలర్లు అని తెలిపారు. పానెసర్ లోని రెండు యూనిట్లు ఏటా 15 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుంటాయి.