ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వినియోగదారులకు చేదువార్త మిగిల్చింది. మారుతి  అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు  బుధవారం తెలిపింది. వచ్చే నెలనుంచి  ఈ పెరిగిన ధరలు అమలవుతాయని తెలిపింది. అయితే ఎంత మేరకు ధరలు పెరుగుతాయన్న విషయం స్పష్టం చేయలేదు. 

ఉత్పత్తి ఖర్చులు, కమోడిటీ ధరలు, అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ తదితర కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ ఆల్టో 800 నుంచి ప్రారంభమైన ప్రీమియం క్రాస్ ఓవర్ ఎస్-క్రాస్క్ రూ. 2.53 లక్షల నుంచి 11.45 లక్షల రూపాయల ధరను విక్రయిస్తోంది.

అదే బాటలో ‘ఇసుజు’
అన్ని మోడళ్లపై రూ.లక్ష వరకు ధరలు పెంచనున్నట్లు యుటిలిటీ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్‌ ఇండియా ప్రకటించింది. తయారీ వ్యయాలు, సరఫరా ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. జనవరి 1 నుంచి రేట్ల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. వాణిజ్య వాహనాలు డి-మాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌, డి-మాక్స్‌ ఎస్‌-క్యాబ్‌లపై 1-2 శాతం మేర, డి-మాక్స్‌ వి-క్రాస్‌, ఎంయూ-ఎక్స్‌ ఎస్‌యూవీలపై 3-4 శాతం మేర రేట్ల పెంపు ఉండొచ్చని కంపెనీ తెలిపింది. అన్ని మోడళ్లు, వేరియంట్లపై రేట్ల పెంపు రూ.15000- లక్ష శ్రేణిలో ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ రూ.7.28- 28.3 లక్షల శ్రేణిలో వాహనాలను విక్రయిస్తోంది. ఇప్పటికే  మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ వంటి కొన్ని సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.

కేశోరామ్‌ టైర్ల వ్యాపారం విభజన
బిర్లా గ్రూపు కంపెనీ కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ తన టైర్ల వ్యాపారాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ ద్వారా అందుబాటులోకి వచ్చే నిధులను వ్యాపార విస్తరణకు ఉపయోగించనుంది. మరోవైపు కేశోరామ్‌ పరిశ్రమలకు రూ.1000 కోట్ల వరకు అప్పు ఉంది. దీనిని తగ్గించుకునేందుకు కూడా టైర్ల వ్యాపార విభజన ఉపయోగపడనున్నది. కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ చేపడుతోన్న రెండో అతిపెద్ద పునర్‌వ్యవస్థీకరణ చర్య ఇది. టైర్ల వ్యాపారాన్ని విభజించి కొత్త సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందిన బిర్లా టైర్స్‌ వెల్లడించింది.