న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మారుతి సుజుకి’ గుజరాత్ రాష్ట్రంలోని బెచరాజీ ఐటీఐలో నైపుణ్య శిక్షణా కేంద్రం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఏటా ఏడు వేల మంది ట్రైనీలకు శిక్షణనిస్తుంది. గుజరాత్ ప్రభుత్వ సహకారంతో బెచరాజీలో ఎక్సలెన్స్ సెంటర్ (సీఓఈ) ఏర్పాటు చేస్తామని తెలిపింది. 

గుజరాత్ రాష్ట్రంలోని ఐటీఐ విద్యార్థుల సాంకేతిక విద్యాస్థాయి పెంపొందించేందుకు, స్కిల్ ఇండియా ఇన్షియేటివ్‌లో సమర్థవంతంగా భాగస్వామ్యం కల్పించేందుకు ఈ చర్య చేపట్టామని మారుతి సుజుకి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. పెరుగుతున్న ఆటోమొబైల్ పరిశ్రమలో యువతను భాగస్వాములను చేసి వారికి లబ్ధి చేకూర్చేందుకే ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది మారుతి సుజుకి.

ఏడాది పాటు శిక్షణ పొందిన 7000 మంది ట్రైనీలకు ఉద్యోగం గ్యారంటీ కల్పిస్తుందని భావిస్తున్నారు. కేవలం బేచరాజీ ఐటీఐలోనే మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గల ఐటీఐల విద్యార్థులకు కూడా ఈ శిక్షణ అందిస్తారు. 

ఆటోమొబైల్, ఆటో కంపొనెంట్స్ గురించి కూడా ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. 11,800 చదరపు అడుగుల సామర్థ్యంతో నిర్మిస్తున్న శిక్షణా కేంద్రంలో వారానికి 150 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వొచ్చు. ఈ సెంటర్ నిర్మాణం కోసం మారుతి సుజుకి రూ.4 కోట్లు పెట్టుబడి పెడుతోంది. 

మారుతి సుజుకి బేసిక్ ట్రైనింగ్ ల్యాబ్, సేఫ్టీ స్టిమ్యులేషన్ హాప్, ఫినిషింగ్ స్కూల్స్ ఫర్ వెల్డ్ షాప్, పెయింట్ షాప్ లతోపాటు ఆరు తరగతి గదులు కూడా ఉంటాయి. వివిధ డ్రేట్లలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు కూడా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సహకరిస్తుంది. సరైన నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగావకాశాలు స్పష్టంగా ఉంటాయని మారుతి సుజుకి ఇండియా తెలిపింది.