Asianet News TeluguAsianet News Telugu

ముచ్చటగా మూడోసారి మారుతి ఎండీగా కెనిచి.. పొదుపు చర్యలు స్టార్ట్

దేశీయ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ ముచ్చటగా మూడోసారి తమ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా కెనిచి అయుకవాను నియమించుకున్నది. ఆయన హయాంలో సంస్థ పురోగతి సాధించింది. మరోవైపు వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో టయోటాటో కలిసి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఆదా దిశగా మారుతి చర్యలు ప్రారంభించింది. 2022 నుంచి మారుతి విటారా బ్రెజ్జా వంటి మోడల్ కార్లు టయోటా ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తారు. ప్రతిగా హైబ్రీడ్, విద్యుత్ వాహనాల తయారీకి అవసరమైన టెక్నాలజీ, డిజైన్లను టయోటా నుంచి మారుతి స్వీకరిస్తుంది. 

Maruti re-appoints Kenichi Ayukawa as MD and CEO for 3 years
Author
Hyderabad, First Published Mar 28, 2019, 11:28 AM IST

ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా మళ్లీ కెనిచి అయుకవా నియమితులయ్యారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నియామకం అమలులోకి వస్తుంది. ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. బుధవారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 

ఇప్పటి వరకు ఆయనకు కల్పించిన వసతులతోపాటు రెమ్యూనరేషన్ కూడా కలిపి అందజేయనున్నది మారుతి సుజుకి. ఆయనను ఎండీగా నియమించుకున్న సంగతిని మారుతి సుజుకి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, సెబీ తదితర సంస్థలకు తెలియజేసింది. 

కెనిచి అయుకవా ఈ పదవిలో కొనసాగడం ఇది మూడోసారి. 2013లో తొలిసారిగా కంపెనీ ఎండీ, సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన రెండోసారి కూడా కొనసాగారు. ఆయన సారథ్యంలో కంపెనీ అన్ని రంగాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేసుకున్నది.

మరోవైపు ఖర్చులను తగ్గించుకోవడానికి మారుతి ప్రయత్నాలను వేగవంతం చేసింది. 2022 నుంచి కంపెనీకి చెందిన ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా..టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్ (టీకేఎం) ప్లాంట్లలో ఉత్పత్తి చేయడానికి మారుతి సుజుకి బోర్డు అనుమతినిచ్చింది. 

దీంతో విటారా బ్రెజ్జా ఉత్పత్తి కోసం మారుతి సుజుకి నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో 2022 నుంచి టయోటా ప్లాంట్లలోనే ఈ బ్రెజ్జా కార్లు ఉత్పత్తి కానున్నాయి. ఇలా ఉత్పత్తైన కార్లు కంపెనీకి చెందిన అవుట్‌లెట్లతోపాటు టీకేఎం రిటైల్ కేంద్రాల్లో కూడా లభించనున్నాయి. 

దీంతోపాటు బాలెనోను కూడా సరఫరా చేయనున్నది. గడిచిన వారంలో జపాన్‌కు చెందిన టయోటా మోటర్ కార్పొరేషన్, సుజుకీ మోటర్ కార్పొరేషన్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రయాణికుల కార్ల తయారీ సంస్థలో రారాజుగా ఉన్న మారుతి సుజుకి ప్రస్తుతం భవిష్యత్ విద్యుత్, హైబ్రీడ్ కార్లను ఉత్పత్తి చేసేందుకు టయోటా హైబ్రీడ్ సిస్టమ్ (టీహెచ్ఎస్)ను ఉపయోగించనున్నది. 

ప్రస్తుతం భారత్, జపాన్ దేశాలకు పరిమితమైన సహకారాన్ని యూరప్, ఆఫ్రికా ఖండ దేశాలకు కూడా విస్తరించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా మారుతి సుజుకి తన భాగస్వామి టయోటాకు సియాజ్ సెడాన్, ఎర్టిగా మల్టీ పర్పస్ వెహికల్స్ డిజైన్లను అందజేస్తుంది. ఇంకా బాలెనో, విటారా బ్రెజ్జా కార్ల డిజైన్లను ఆఫ్రికాలో టయోటాకు బదిలీ చేయనున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios