న్యూఢిల్లీ: జనవరిలో దేశీయ వాహన విక్రయాలు మందకొడిగా నమోదయ్యాయి. గత నెల దేశీయ అమ్మకాల్లో మారుతీ సుజుకీ అతి స్వల్ప వృద్ధిని నమోదు చేయగా.. హ్యుండాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా విక్రయాల్లో సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. హోండా కార్స్‌ విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. కానీ టాటా మోటార్స్‌ అమ్మకాలు నిరాశపరిచాయని, దీనికి ఆర్థిక వ్యవస్థ ప్రతికూలతలు ప్రభావం చూపాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

మారుతీ సుజుకీ కార్ల దేశీయ అమ్మకాలు 1,40,600 నుంచి 1.1 శాతం వృద్ధి చెంది 1,42,150కు చేరాయి. గత నెలలో ఆల్టో, వ్యాగన్‌ఆర్‌లతో కూడిన మారుతీ చిన్నకార్ల విభాగం విక్రయాలు స్వల్పంగా పెరిగి 33,408గా నమోదయ్యాయి. గతేడాది జనవరిలో ఇవి 33,316గా ఉన్నాయి.  సెలెరియో, బాలెనో, డిజైర్‌ మోడళ్ల అమ్మకాలు సైతం 3.5 శాతం క్షీణించాయి. విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎర్టిగా వంటి యుటిలిటీ వాహన విక్రయాలు 8.4 శాతం పెరిగి 22,430కు చేరాయి. టాటా మోటార్స్‌ అమ్మకాలు మాత్రం 8 శాతం వెనుకబడ్డాయి.  

దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగాయి. 2018 జనవరి 49,432 కార్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది 52,500 యూనిట్లకు చేరాయి. గ్రామీణ ప్రాంత కొనుగోళ్లు పెరగ్గా, ఇంధన ధరలు తగ్గుముఖం పట్టి, పారెక్స్ మూవ్ మెంట్ లో పురోగతి నమోదు కావడం కూడా కస్టమర్ సెంటిమెంట్ పాజిటివ్ గా మారిందని సంస్థ ఆటోమోటివ్ సెక్టర్ అధ్యక్షుడు రాజన్ వాధెరా పేర్కొన్నారు. 

హోండా కార్స్ మాత్రం 23 శాతం సేల్స్ పెంచుకున్నది. గతేడాది 14,838 కార్లు విక్రయించగా, ఈ ఏడాది 18,261 యూనిట్లు విక్రయించింది. మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నగరాలు, త్రుతీయ శ్రేణి పట్టణ, గ్రామీణ మార్కెట్లపై కేంద్రీకరించామని హోండా కార్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేశ్ గోయల్ పేర్కొన్నారు. 

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా స్వల్పంగా విక్రయాలు పెంచుకోగలిగింది. గతేడాది జనవరిలో 45,508 కార్లు విక్రయించగా, ఈ ఏడాది 45,803 కార్లు అమ్మగలిగింది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) సేల్స్ 9.14 శాతం తగ్గాయి. 2018 జనవరిలో 12,351 కార్లు విక్రయించిన టీకేఎం ఈ ఏడాది 11,221 యూనిట్ల విక్రయంతోనే సరిపెట్టుకున్నది. మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్య లభ్యత వంటి అంశాలు కారణమని టీకేఎం డిప్యూటీ ఎండీ ఎన్ రాజా తెలిపారు. 

నికే బైక్ మేకర్ రాయల్ ఎన్ ఫీల్డ్ విక్రయాలు కూడా ఏడు శాతం తగ్గాయి. దేశీయంగా గతేడాది 76,205 బైకులను విక్రయిస్తే ఈ ఏడాది కేవలం 70,872 మోటారు సైకిళ్లను మాత్రమే అమ్మగలిగింది. టాటా మోటార్స్ సేల్స్ ఎనిమిది శాతం తగ్గాయి. గతేడాది 59,441 కార్లు విక్రయించిన టాటా మోటార్స్ ఈ ఏడాది 54,915 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో 11 శాతం వెనుకబడింది. 

మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ ఒకశాతం పెరిగాయి. గతేడాది 22,065 ట్రాక్టర్లు విక్రయించిన మహీంద్రా ట్రాక్టర్, ఈ ఏడాది 22,212 యూనిట్లు విక్రయించగలిగింది. దేశీయ విక్రయాలు ఒకశాతం పెరిగితే, ఎగుమతులు రెండు శాతం పెరిగాయి. హిందుజా అనుబంధ సంస్థ అశోక్ లేలాండ్స్ విక్రయాలు 9 శాతం పెరిగాయి.