భారతదేశంలో ఆటోమొబైల్ రంగంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్ను విదేశాలతో పోలిస్తే చాలా ఎక్కువేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివ్రుద్ధికి, డిమాండ్ స్రుష్టించడానికి ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని మారుతి సుజుకి సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) కెనిచి అయుకావా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బైక్‌లను విలాస వస్తువుల జాబితా నుంచి తగ్గించాలన్న పవన్ ముంజాల్
ఇంతకుమందు హీరో మోటార్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్.. మోటారు బైక్‌లను విలాసవంతమైన వస్తువుల జాబితా నుంచి తప్పించాలని, జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని తొలుత డిమాండ్ చేశారు. తదుపరి బజాజ్ ఆటోమొబైల్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ బజాజ్ మద్దతు పలికారు.

జీఎస్టీతోపాటు 15 శాతం వరకు అదనపు సెస్
ప్రస్తుతం దేశీయంగా కార్ల విక్రయాలపై 28 శాతం జీఎస్టీతోపాటు దాని పొడవు, ఇంజిన్ సైజ్, కారు టైపును బట్టి అదనపు సెస్ ఒకటో శాతం నుంచి 15 శాతం విధిస్తున్నది. ఈ సందర్భంగా మారుతి సుజుకి భారత్ సీఈఓ అండ్ ఎండీ కెనిచి అయుకావా మీడియాతో మాట్లాడుతూ ‘విదేశాలతో పోలిస్తే భారతదేశంలో ఒకింత పన్ను భారం ఎక్కువ. దేశంలో ఆటోమొబైల్ రంగ పరిశ్రమ అభివ్రుద్ది కోసం పన్నులను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరినా అంత తేలిక కాదు’ అని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంతో కలిసి పరిష్కారం కనుగొనాలన్న మారుతి సుజుకి
ఆటోమొబైల్ వాహనాల తయారీ, విక్రయాలపై వసూలు చేస్తున్న పన్ను భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి పరిష్కార మార్గం కనుగొనాల్సి ఉన్నదని మారుతి సుజుకి భారత్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి అయుకావా చెప్పారు. ప్రజల్లో డిమాండ్‌ను ప్రోత్సహించడానికి పన్ను తగ్గించడమే ఉత్తమ మార్గం అని అన్నారు. ప్రస్తుతం వస్తున్నది తాత్కాలిక బడ్జెట్ మాత్రమేనని తేల్చేశారు.

ఎన్నికల తర్వాత బడ్జెట్ కీలకం అన్న కెనిచి అయుకావా
ఎన్నికల తర్వాత వెలువడే బడ్జెట్ ఎంతో కీలకమని మారుతి సుజుకి ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి అయుకావా స్పష్టం చేశారు. అయితే ఆటోమొబైల్ రంగ సమస్యలు, అవసరాలు, పరిష్కారాల గురించి తాము నిత్యం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని తెలిపారు. ఆ క్రమంలో వినియోగదారులను ప్రోత్సహించడానికి పన్ను రాయితీ కల్పించాలని కోరుతూనే ఉన్నామన్నారు. 

వరుసగా ఐదో నెల తగ్గిన కార్ల విక్రయాలు
గత ఆరు నెలలకు 2018 డిసెంబర్‌లో వరుసగా ఐదో నెల కూడా ప్రయాణికుల వాహనాల విక్రయాలు తగ్గిపోయిన నేపథ్యంలో ఆటోమొబైల్ రంగానికి పన్ను రాయితీ కల్పించాలన్న డిమాండ్ ఊపందుకుంటున్నది. 2017తో పోలిస్తే 2018 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య ప్రయాణ వాహనాల విక్రయాలు 4.37 శాతం పెరిగాయి. 2017లో వివిధ ఆటోమొబైల్ సంస్థలు 24,27,046 కార్లను విక్రయించగా, 2018లో 25,33,221 కార్లను విక్రయించాయని సియామ్ పేర్కొంది. 

వ్రుద్దిరేట్ తగ్గించుకున్న మారుతి సుజుకి 
ఆరు నెలల్లో వరుసగా ఐదు నెలల పాటు విక్రయాలు తగ్గిపోవడంతో భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్రుద్ధిరేటును మారుతి సుజుకి ఇండియా 8 శాతానికి తగ్గించుకున్నది. అధిక వడ్డీరేట్లకు తోడు బీమా వ్యయం భారీగా పెరుగడంతో కార్ల కొనుగోళ్ల డిమాండ్ తగ్గుముఖం పట్టింది. ఇంతకుముందు 2018-19లో మారుతి సుజుకి విక్రయాల్లో రెండంకెల వ్రుద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 

మార్కెట్లోకి మారుతి న్యూ వాగన్ ఆర్
ప్రముఖ ఆటోమొబైల్‌  సంస్థ మారుతి సుజుకి మూడో తరం వాగన్ ఆర్‌ మోడల్‌ కారును భారత్‌లో విడుదల చేసింది. ప్రారంభ ధర .4.19 లక్షలుగా ఉంది. ఇందులో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జీఎక్స్ఐ వేరియంట్లలో మారుతి వాగన్ ఆర్ అందుబాటులో ఉన్నాయి. గతంలో 1.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్ గతంలో ఉండగా ఇప్పుడు 1.2లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కూడా చేర్చారు. ఈ సరికొత్త వాగన్ ఆర్‪ను నూతన తరం హ్యుండాయ్‌ శాంత్రో, టాటా టియాగో మోడల్ కార్లకు పోటీగా ప్రవేశపెట్టారు.

వాగన్ ఆర్‪ ఇంజిన్ ఇంధన సామర్థ్యం ఇలా..
కొత్త వాగన్ ఆర్‪లో లీటర్ ఇంజిన్‌ 67బీహెచ్‌పీ శక్తిని, 90ఎన్‌ఎం టార్క్‌.. 1.2లీటరు ఇంజిన్‌ 82బీహెచ్‌పీ శక్తిని, 113ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. రెండు ఇంజిన్లకు కూడా 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంటుంది. కొన్ని వేరియంట్లకు ఏజీఎస్‌ ఆటోమాటిక్‌ గేర్‌బాక్స్‌ కూడా ఉంటుంది. అలాగే డ్రైవర్‌ వైపు ఎయిర్‌బ్యాగ్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌(ఈబీడీ)తోపాటు యాంటిలాక్‌ బార్కింగ్‌ సిస్టమ్‌, సీటు బెల్టు గుర్తుచేసే విధానం, వేగాన్ని అలర్టింగ్ సిస్టమ్, ప్రత్యేక పార్కింగ్‌ సెన్సార్లు కొత్త వేగనార్‌లో ఉన్నాయి. ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతుంది.