న్యూఢిల్లీ: భారతదేశంలోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ సంస్థ మంగళవారం మార్కెట్‌లోకి కొత్త మోడల్ ‘మరాజ్జో’ కారును ఆవిష్కరించనున్నది. ఈ కారు ఇప్పటికే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆదిపత్యం ప్రదర్శిస్తున్న మారుతి సుజుకి ఎర్టిగ, టయోటా ఇన్నోవా క్రిష్టా మోడల్ కార్లతో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో ఎక్స్ షోరూమ్‌లో మహింద్రా ‘మరాజ్జో’ మోడల్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షలు పలుకనున్నది. 

భారతదేశ మార్కెట్‌లో మహీంద్రా మరాజ్జో ఎంపీవీ మోడల్ కారు కొనుగోలు కోసం డీలర్ల వద్ద వినియోగదారులు కార్లు బుక్ చేసుకున్నారు. మహీంద్రా మరాజ్జో మోడల్ కారు కావాలనుకున్న వారు రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి వచ్చింది. ఒకసారి మార్కెట్‌లోకి మహీంద్రా మరాజ్జో మోడల్ కారు.. మహీంద్రా సంస్థకే ఫ్లాగ్ షిప్ ఆఫర్ కానున్నది. 

షార్క్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న మహీంద్రా మరాజ్జో.. షార్ప్ అండ్ టెయిల్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, క్రోమ్ టూత్డ్ గ్రిల్లే కలిగి ఉంది. అంతేకాదు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (డే టైమ్ రన్నింగ్ లైట్స్)తోపాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కలిగి ఉంటుంది. సంప్రదాయ కారు కంటే ప్రకాశవంతంగా మార్కెట్ లో మరాజ్జో మోడల్ కారు వెలిగిపోనున్నది. అంతే కాదు ఏడు నుంచి ఎనిమిది మంది ప్రయాణికులు వెళ్లేందుకు మహింద్రా మరాజ్జో వెసులుబాటుగా సీటింగ్ డిజైన్ చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. 

టయోటా ఇన్నోవా క్రిస్టాలో మాదిరిగా రెండో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. కూలింగ్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంది. ఎంపీవీతోపాటు ఆటోమేటిక్‌గా ట్రాన్స్ మీట్ అయ్యేందుకు వెసులుబాటు కలిగి ఉంది. ప్రస్తుతానికి డీజిల్‌తో నడిచే మహింద్రా మరాజ్జో మోడల్ మార్కెట్ లో అందుబాటులో ఉండనున్నది. అంతేకాదు సంస్థ ఎస్‌యూవీ మోడల్ కారుగా కూడా ప్రసిద్ధి చెందనున్నది. కొన్ని రోజుల క్రితం మహీంద్రా సంస్థ యాజమాన్యం తన డీలర్‌షిప్‌లను ‘వరల్డ్ ఆఫ్ ఎస్‌యూవీస్’ రూపొందిస్తామని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 350 ఔట్‌లెట్లలో మహీంద్రా మరాజ్జో కారును మార్కెట్ లో ఆవిష్కరించనున్నది.