ముంబై: దేశీయంగా ఆటోమొబైల్ రంగంలో సేవలందిస్తున్న ‘మహీంద్రా అండ్ మహీంద్రా’.. అమెరికాకు చెందిన బిల్ ఫోర్డ్ జూనియర్ సారథ్యంలోని ఫోర్డ్ కంపెనీ స్వాధీనంలోకి వెళ్లనున్నదని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఆనంద్ మహింద్రా, ఫోర్డ్ సంస్థ యజమాని బిల్ ఫోర్డ్ జూనియర్ మధ్య ప్రాథమికంగా సంప్రదింపులు జరుపుతున్నారు. 

1995కి ముందు రెండు దశాబ్ధాల ముందు మాదిరిగా మరో దఫా సుదీర్ఘ అనుబంధం పెనవేసుకునే దిశగా అడుగులేస్తున్నారు. దీని ప్రకారం మహీంద్రా అండ్ మహీంద్రాలో 49 శాతం వాటాను ఫోర్డ్ స్వాధీనం చేసుకోనున్నది. రెండు సంస్థలు భారతదేశంలో జాయింట్ వెంచర్‌గా ఉత్పత్తి చేపట్టాలని భావిస్తున్నాయని రెండు సంస్థల సన్నిహిత వర్గాల కథనం. అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, జాయింట్ వెంచర్‌గా మారుతుందా? లేదా? చెప్పలేమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

మహీంద్రా అండ్ మహీంద్రా పూర్తిగా ఫోర్డ్ సంస్థకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని తహతహలాడుతోంది. అలాగే అమెరికా మార్కెట్‌లో వాటాను పొందాలని కోరుకుంటున్నది. ఇంతకుముందు కూడా మహీంద్రా అండ్ మహీంద్రా ఇతర ఆటోమొబైల్ సంస్థలు.. ఫ్రెంచ్ కారు మేకర్ రెనాల్ట్, నావిస్టార్ సంస్థలతో జాయింట్ వెంచర్ కోసం ప్రయత్నాలు సాగించినా ఫలించలేదు. 

1998 నుంచి భారతదేశ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి రకరకాల పాట్లు పడుతోంది ఫోర్డ్ యాజమాన్యం. రెండు బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినా లాభాలు గడించలేకపోయింది ఫోర్డ్. ఈ నేపథ్యంలో తన సమస్యలను అధిగమించేందుకు మహింద్రా అండ్ మహింద్రా సంస్థ దేశీయ సేల్స్, నిర్వహణ మోడల్‌తో కలిసి భారతదేశ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయాలని భావిస్తోంది ఫోర్డ్. 

ఫోర్డ్ ఇండియా విక్రయాలు 2017లో ఒక శాతం పెరిగి 87,588కి చేరుకున్నాయి. ఎగుమతులు 15 శాతం పెరిగి 1,75,588 యూనిట్లకు చేరాయి. ఫోర్డ్ ఇండియా జూలై విక్రయాలు, ఎగుమతులు కలిసి గతేడాది 26,075 కార్లయితే, ఈ ఏడాది 25,028 కార్లు ఉన్నాయి. దీనిపై ఫోర్డ్ ఇండియా అధికార ప్రతినిధి ‘ఈ- మెయిల్’ ద్వారా చేసిన ప్రశ్నకు స్పందించేందుకు నిరాకరించారు. వదంతులు, రూమర్లపై స్పందించబోమన్నారు. కాకపోతే భారతదేశంలో సుస్థిర, లాభదాయక బిజినెస్ నిర్మించుకోవడానికి వ్యూహాన్ని అమలు చేస్తున్నామని ఆ ప్రతినిధి తెలిపారు. 

అంతేకాదు ఆర్థికంగా ఫోర్డ్ ఇండియా ఉత్తమ సంస్థగా పేరు సంపాదించుకున్నదని ఆ సంస్థ పేర్కొంది. దేశీయ ఆదాయం 2017 - 18లో ఒక బిలియన్ డాలర్లకు చేరుకున్నది. పది లక్షల మంది వినియోగదారులను కూడగట్టుకున్నామని ఫోర్డ్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.