2022కల్లా ‘మహీంద్రా - స్మార్ట్‌ఈ’ లక్ష విద్యుత్ వెహికల్స్.. జాబ్స్‌పై రాజన్ ఇలా
దేశంలో ప్రయాణ వాహనాలను విద్యుత్ వినియోగంలోకి మార్చేందుకు ఆటోమొబైల్ సంస్థలన్నీ శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నాయి.ఈ క్రమంలో మహీంద్రా ఎలక్ట్రిక్ స్పీడ్ పెంచే ప్రయత్నంలో ఉంది.
2020 కల్లా దేశవ్యాప్తంగా 10,000 విద్యుత్ త్రిచక్ర వాహనాలను తేవడం కోసం మహీంద్రా ఎలక్ట్రిక్, స్మార్ట్‌ఈ సంస్థలు జత కట్టాయి. ఈ భాగస్వామ్యం కింద మార్చి 2019 కల్లా ఢిల్లీ, దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో (ఎన్సీఆర్) ప్రాంతాల్లో1000 మహీంద్రా ట్రెయో, ట్రెయో యారీ విద్యుత్ త్రిచక్ర వాహనాలను స్మార్ట్‌ఈ సిద్ధం చేస్తుంది.
‘ఇప్పటికే స్మార్ట్ ఈ మా వద్ద 50 ట్రెయో వాహనాలను తీసుకుంది. మార్చి కల్లా 1000 వాహనాలను ఢిల్లీ ప్రాంతాల్లో నడిపించాలన్నది ప్రణాళిక’ అని మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈఓ మహేశ్ బాబు మీడియాకు చెప్పారు. గత నెలలో మహీంద్రా ఎలక్ట్రిక్ తొలి లిథియం అయాన్ విద్యుత్ త్రిచక్ర వాహన శ్రేణి ట్రెయో, ట్రెయో యారీలను రూ.1.36 లక్షల ప్రారంభ ధరతో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
2022 కల్లా లక్ష వాహనాలను రోడ్ల మీదకు తీసుకు రావాలని యోచిస్తున్నట్లు స్మార్ట్‌ఈ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ గోల్డీ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘మహీంద్రా ఎలక్ట్రిక్ ఉత్పత్తులు మా వృద్ధి వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నాం’ అని ఆయన అన్నారు. త్వరలో ఏ యే నగరాల్లోకి వీటిని తేనున్నదీ చెప్పడానికి ఆయన నిరాకరించారు.
ఉద్యోగాలొచ్చే రంగాల్లోనే మరింత వృద్ధి అన్న రాజన్
ముడి చమురు ధరలపై భౌగోళిక, రాజకీయ అంశాలు ప్రభావం చూపుతున్నందున, భారత్‌కు మెరుగైన చమురు హెడ్జింగ్ విధానం అవసరమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలోనే చర్చలు జరిగాయని.. అనంతరం వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. చమురు ధరల హెడ్జింగ్‌పై సత్వరం కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు.
జీడీపీ ఇంకా పెరగాల్సిన అవసరం ఇదీ
‘జీడీపీ విషయానికొస్తే ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. 2.5 కోట్ల మంది ప్రజలు 90,000 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారంటే.. ఎక్కువ ఉద్యోగాలను సృష్టించడం లేదని అర్థం. అంటే ఉద్యోగాలు వచ్చే రంగాల్లో కూడా వృద్ధి సరిగ్గా లేదని దీని అర్థం’ అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వివరించారు.
అందువల్ల అధిక ఉద్యోగాల కల్పన సాధ్యమయ్యే రంగాలు, మరింతగా వృద్ధి చెందేలా చర్యలుండాలని సూచించారు. వ్యవసాయం, బ్యాంకింగ్, విద్యుత్ వంటి రంగాలపై దృష్టి సారించి.. వాటిని తిరిగి వృద్ధి పట్టాలపైకి తేవాల్సిన అవసరం ఉందని వివరించారు.