దేశీయంగా విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు దీర్ఘకాలిక పాలసీని ప్రకటించాలని కేంద్రానికి భారత వాహనదారుల తయారీ సంఘం (సియామ్) సూచించింది. పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సూచన చేసింది.

ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలతో భవిష్యత్ పెట్టుబడులకు ఎలాంటి ఉపయోగం లేదని, దీంతో నూతన పాలసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని సియామ్ అధ్యక్షుడు అభయ్ ఫిరోదియా సూచించారు.

విధానం లేకుండా ప్రత్యేక చర్యలతో నో యూజ్
‘దేశంలో పెద్ద ఎత్తున వాహనాల విద్యుదీకరణకు అనుకూలంగా కేంద్రం గతంలో ప్రకటన చేసింది. కానీ ఊహించని రీతిలో, ఈవీల ప్రోత్సాహానికి ప్రత్యేకంగా విధానమేదీ విడుదల చేయబోమని కూడా చెప్పింది. బదులుగా ప్రత్యేక చర్యల ద్వారా విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచుతామని చెబుతోంది’ అని సియామ్ అధ్యక్షుడు ఫిరోదియా పేర్కొన్నారు.

దేశంలో 2030 నాటికి 40%, 2047 నాటికి 100 శాతం వాహనాల విద్యుదీకరణకు కావలసిన విధానపరమైన చర్యలను సియామ్‌ సూచించిందన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై తక్కువ స్థాయిలో పన్ను విధించడం ద్వారా వీటికి ఊతమిచ్చినట్లు అవుతున్నదని వార్షిక సమావేశంలో ఆయన పేర్కొన్నారు. 

విద్యుత్ వాహన ఉత్పత్తికి మౌలిక వసతులు కావాలి
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంటాయని ముందస్తు అంచనావేయడం కష్టమని, ఇందుకు కేంద్రం ప్రకటించే పాలసీ ఇందుకు కేంద్ర బిందువు అవుతుందని సియామ్ అధ్యక్షుడు అభయ్ ఫిరోదియా చెప్పారు. ‘అయినా ప్రభుత్వం దీర్ఘకాలిక విధానం ప్రకటించకుండా వెనక్కు తగ్గింది.

ఇది పరిశ్రమకు మేలు చేసేది కాదు. స్పష్టమైన లక్ష్యాలను ప్రకటిస్తే పరిశ్రమ భవిష్యత్ పెట్టుబడులకు సిద్ధమయ్యేందుకు వీలవుతుంది’ అని ఫిరోదియా వివరించారు. ఈవీలకు మౌలిక సదుపాయాలు, పూర్తి స్థాయి ఎకోసిస్టమ్‌ అవసరమన్నారు. 

దీర్ఘకాలిక ప్రయోజనాలపై కేంద్రం కేంద్రీకరించాలన్న సియాం
ఈవీలకు ఊతమివ్వాలంటే ముందుగా తయారీ సంస్థలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని, అప్పుడే ఆయా సంస్థలు తయారీ చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుందని సియామ్ అధ్యక్షుడు అభయ్ ఫిరోదియా అన్నారు.

పాలసీ నిర్ణయాల్లో 2030 నాటికి 40 శాతం, 2047 నాటికి వంద శాతం పూర్తిచేయాలని కేంద్రానికి సియామ్ విజ్ఞప్తి చేసింది. గతేడాది అమలులోకి వచ్చిన జీఎస్టీపై  సియామ్ అధ్యక్షుడు అభయ్ ఫిరోదియా స్పందిస్తూ..దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని, దీర్ఘకాలికంగా ప్రయోజనం కల్పించేవాటిపై ఇకనైనా కేంద్రం దృష్టి సారించాలన్నారు. 

అధిక పన్నులతో ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కార్ల వాడకం చాలా తక్కువ స్థాయిలో ఉన్నదన్న సియామ్ అధ్యక్షుడు ఫిరోదియా.. అధిక పన్నుల విధింపులతో ఇండస్ట్రీపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నదన్నారు. ముఖ్యం గా జీఎస్టీలో 28 శాతంతోపాటు మరో 15 శాతం అదనపు సుంకం విధిస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు.

అలాగే బీఎస్-6 ఉద్గార నిబంధనలు అమలు చేయాలంటే ఇండస్ట్రీ లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదిలా ఉంటే సియామ్ అధ్యక్షుడిగా ఫిధోరియా స్థానే మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ రాజన్ వధేరా నూతన అధ్యక్షుడిగా నియమితు లయ్యారు. ఉపాధ్యక్షుడిగా మారుతి సుజుకీ ఇండియా ఎండీ కెనిచి అయుకవా ఎన్నికయ్యారు. 

మూడు కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్!
విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఎంపిక చేసిన నగరాలు, జాతీయ రహదారులపై ప్రతి మూడు కిలోమీటర్లకో చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా గురువారం మీడియాకు తెలిపారు.

శుక్రవారం  గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. చార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడిన తర్వాతే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజాదరణ పొందనున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అన్నారు. ఈ స్టేషన్ల ఏర్పాటుకు లైసెన్స్ అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు.