న్యూఢిల్లీ: లండన్‌ ‘లారెట్‌ ఆటోమోటివ్‌ కార్పొరేషన్‌’ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగా 2021కల్లా తన విద్యుత్ ఎస్‌యూవీ డియాన్‌ఎక్స్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ కంపెనీ పుదుచ్చేరిలో 37 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,577 కోట్లు) పెట్టుబడితో వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉంది. 

పుదుచ్ఛేరిలోని లారెట్ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10వేల వాహనాలుగా ఉంది. 2023 నాటికి ఈ సామర్థ్యాన్ని 23వేల వాహనాలకు పెంచాలని కంపెనీ భావిస్తోంది. డియాన్‌ఎక్స్‌ దాని విడిభాగాలను ఈ ప్లాంట్‌లోనే తయారు చేసి అసెంబ్లింగ్ చేయనున్నారు. 2021 నాటికి ఈ ప్లాంట్‌ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ సీఈఓ మార్కస్‌ పలేటి తెలిపారు.
 
డియాన్‌ఎక్స్‌ను ఒకసారి చార్జింగ్‌ చేస్తే 540 కిమీ వరకు ప్రయాణించవచ్చని లారెట్ సీఈఓ మార్కస్ పలేటి చెప్పారు. 2021లో భారత్‌తోపాటు యూరోపియన్‌ మార్కెట్లలోనూ ఏకకాలంలో విడుదల చేస్తామని తెలిపారు. రెండు వేరియంట్లలో డియాన్‌ఎక్స్‌ అందుబాటులో ఉంటుందని, ధర రూ.40 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. 

5.4 సెకన్ల వ్యవధిలోనే ఈ మోడల్‌ 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని లారెట్ సీఈఓ మార్కస్ పలేటి చెప్పారు. ఈ ఎస్‌యూవీలో అత్యాధునిక ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంటిగ్రేషన్‌ ఉంటుందని చెప్పారు. దీని ధర రూ.40 లక్షల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. దీనికి తోడు జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని లేహ్ నుంచి తమిళనాడు రాజధాని చెన్నై వరకు ఆరువేల కి.మీ. పరిధిలో 12కి పైగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. 

అందుకు చిన్న మదుపర్ల గ్రూపుతో కలిసి చార్జింగ్ స్టేషన్లను ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లారెట్ లక్ష్యంగా ఉన్నది. ప్రస్తుతం బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో మార్కెటింగ్ వసతులు కల్పిస్తోంది.