అధిక ఇంధన ధరలు, బీమా వ్యయం తదితర అంశాలతో కార్ల విక్రయాల్లో నెగెటివ్ ట్రెండ్ కనిపించినా భారతదేశంలో కార్ల విక్రయానికి భవిష్యత్ ఉంటుందని కియామోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కూఖ్యూన్ షిమ్ తెలిపారు.

2019లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నూతన మోడల్ కారు మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో మూడు లక్షల యూనిట్లు విక్రయిస్తామని ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో తాము త్వరితగతిన కియా కార్ల తయారీ యూనిట్ నిర్మాణం పూర్తి కావడంతో రాష్ట్ర ప్రజలు సైతం ఆశ్చర్యపోయారని కియా మోటార్స్ ఎండీ కూఖ్యూన్ షిమ్ చెప్పారు. కానీ కార్లను ఉత్పత్తి చేయడం భిన్నమైన వ్యవహారం అని తెలిపారు.

నాణ్యతతో కార్లను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నదని, బిజినెస్ అంటే వెండార్లు కూడా ఉంటారని పేర్కొన్నారు. కార్లను తయారు చేయడానికి సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని కియా మోటార్స ఎండీ కూఖ్యూన్ షిమ్ తెలిపారు.

అప్పుడే సమగ్ర బిజినెస్ చేయగలమన్నారు. నూతన ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత పాటించాల్సిన అవసరం ఉన్నదని కూఖ్యూన్ షిమ్ చెప్పారు. 

కియా మోటార్ల తయారీ కోసం తాము చేపట్టిన ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిచ్చిందన్నారు. పలు ఇన్సెంటివ్‌లను అందజేసిందని కియా మోటార్స్ ఎండీ కూఖ్యూన్ షిమ్ తెలిపారు.

స్థానికంగా ఏజెన్సీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి 100 శాతం ఏజెన్సీలను ఏర్పాటు చేసుకోలేకపోయినా.. భవిష్యత్‌లో 100 శాతం స్థానిక వెండర్లకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. 

కార్ల విక్రయంలో కస్టమర్ల సంత్రుప్తే తమకు ప్రధానమని కియా మోటార్స్ ఎండీ కూఖ్యూన్ షిమ్ తెలిపారు. ఖాతాదారులు కంఫర్టబుల్‌గా భావిస్తే సరిపోతుందన్నారు. త్వరలో ఎస్‌యూవీ మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేశామని చెప్పారు. అంతర్జాతీయంగా 25 మోడల్ కార్లు ఉత్పత్తి చేశామని, భవిష్యత్‌లో వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కార్లు తయారు చేస్తామని తెలిపారు.