న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్‌ భారత్‌లో విడుదల చేయనున్న తొలికారు సెల్టోస్‌ బుకింగ్స్‌ను ఈ నెల 16 నుంచి ప్రారంభించనుంది. దేశంలోని 206 విక్రయ కేంద్రాలతోపాటు ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్స్‌ ప్రారంభం అవుతాయి. దేశంలోని 160 పట్టణాల్లో 265 టచ్‌పాయింట్లను కియా మోటార్స్ ప్రారంభించింది. 

కియా మోటార్స్ విక్రయ కేంద్రాల వద్ద రూ.25 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్‌ను చేసుకోవచ్చు. సెల్టోస్‌ జీటీలైన్‌, టెక్‌లైన్‌ రెండు సెగ్మెంట్లలో అందుబాటులోకి రానున్నది. దీనిలో మూడు ఇంజిన్లను ఆప్షన్లు ఇచ్చారు. 1.5 లీటర్‌ పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌, 1.4 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్లను అమర్చారు. 

సెల్టోస్ విభాగంలో 3 ట్రాన్స్‌మిషన్‌ మోడ్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు. 7డీసీటీ, 6ఐవీటీ, 6ఏటీలను అందుబాటులో ఉంచారు. కియా మోటార్స్‌ విక్రయ విభాగం అధిపతి మనోహర్‌భట్‌ మాట్లాడుతూ ‘భారతీయులను దృష్టిలో పెట్టుకుని సెల్టోస్‌ను తయారు చేశాం. ఈ విభాగం మొత్తంలో సరికొత్త మార్పును తెచ్చేలా దీనికి రూపకల్పన చేశాం’ అని పేర్కొన్నారు.