న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ అనుబంధ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) అమ్మకాలు జూలైలో భారీ క్షీణించాయి. ఒడిదుడుకులు అధికంగా ఉండడంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 21.6 శాతం తగ్గి 36,144 యూనిట్లకు పరిమితమైనట్లు ఆ సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఫెలిక్స్‌ బ్రౌటిగమ్‌ తెలిపారు. జాగ్వార్‌ బ్రాండ్‌ సేల్స్‌ 15.2 శాతం తగ్గి 10,992 యూనిట్లుగా నమోదుకాగా.. ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు 24 శాతం క్షీణించి 25,152 యూనిట్లుగా నిలిచాయన్నారు. ఇదిలా ఉండగా జూలైలో కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టగా, ద్విచక్ర వాహనాల సేల్స్ అలాగే దూకుడుగా ఉన్నాయి.

అమ్మకాలపై జాగ్వార్ సీఎఫ్ఓ ఇలా 


‘కీలక మార్కెట్లలో గత నెల అమ్మకాలు క్లిష్టతరంగా మారాయి. చైనాలో రిటైల్‌ సేల్స్‌ 46.9 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తేలికపాటి వాహన పరీక్షా విధానంలో జాప్యం వల్ల బ్రిటన్‌లో అమ్మకాలు 18.3 శాతం తగ్గాయి. ఉత్తర అమెరికాలో 9.5 శాతం తగ్గుదల నమోదైంది. టారిఫ్‌ మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఫెలిక్స్‌ బ్రౌటిగమ్‌ వివరించారు. వాణిజ్య యుద్ధంతో కొనుగోలుదారుల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఫెలిక్స్‌ బ్రౌటిగమ్‌ చెప్పారు. మరోవైపు దేశీయంగా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 16% పెరిగి 19,410 యూనిట్లుగా నమోదయ్యాయి. 

దేశీయంగా ప్యాసింజర్ వాహనాలకు బ్రేక్


దేశీయంగా ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల జోరుకు బ్రేకులు పడ్డాయి. గత తొమ్మిది నెలల్లో తొలిసారిగా జూలైలో అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో జీఎస్‌టీ అమలు కారణంగా భారీ విక్రయాలు నమోదు కావటంతో ఈ సారి అప్పటితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం జూలైలో ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు 2,90,960 యూనిట్లకు తగ్గాయి. గతేడాది జూలైలో అమ్మకాలు 2,99,066 యూనిట్లుగా నమోదైయ్యాయి. దేశీయంగా కార్ల అమ్మకాలు కూడా గత నెల స్వల్పంగా క్షీణించాయి. 2017 జూలైలో 1,92,845 కార్లు అమ్ముడవగా గత నెల 1,91,979కి తగ్గాయి. ‘జీఎస్‌టీ అమలు వల్ల గతేడాది జూలైలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు ఒక్కసారిగా ఎగిశాయి. దానితో పోలిస్తే గత నెలలో అమ్మకాలు తగ్గినప్పటికీ అన్ని విభాగాలు పుంజుకోవడంతో పరిశ్రమ సంతృప్తిగానే ఉంది‘ అని సియామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుగతో సేన్‌ తెలిపారు.

ఏప్రిల్ నుంచి కోటి వాహనాల ఉత్పత్తి


ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో దేశీయంగా కోటి వాహనాల ఉత్పత్తి జరిగిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన 93 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 17% అధికమని సియామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుగతో సేన్‌ వివరించారు. చాలా సంవత్సరాల తర్వాత పరిశ్రమలోని విభాగాలన్నీ వృద్ధి కనపరుస్తున్నాయని, మరో రెండేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగగలదని ఆశిస్తున్నట్లు సేన్‌ చెప్పారు. జీఎస్‌టీ కారణంగా గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎగిసిన అమ్మకాలతో పోలిస్తే రాబోయే రెండు నెలల్లో విక్రయాలు మందగించినట్లు కనిపించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  

అగ్రస్థానంలో మారుతీ


విక్రయాలు స్వల్పంగా తగ్గినా 1,52,427 వాహనాల అమ్మకాలతో జూలైలో దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ  అగ్రస్థానంలో నిల్చింది. హ్యుండాయ్‌ అమ్మకాలు 1.1% పెరిగి 43,481 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా కార్స్‌ ఇండియా 17% వృద్ధితో (19,970 వాహనాలు) మూడో స్థానానికి చేరింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు ఆరు శాతం క్షీణించి 19,739 యూనిట్లకు పరిమితమయ్యాయి.

8శాతం పెరిగిన ద్విచక్ర వాహనాల విక్రయాలు


ద్విచక్ర వాహనాల అమ్మకాలు జూలైలో 8% పెరిగి 18,17,077 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో ఈ సంఖ్య 16,79,876 యూనిట్లు. హీరో మోటోకార్ప్‌ అమ్మ కాలు 12% పెరిగి 6,10,197 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌  విక్రయాలు 1,62,987 నుంచి 1,68,075 యూనిట్లకు చేరాయి. బజాజ్‌ ఆటో సంస్థ మోటార్‌ సైకిల్‌ అమ్మకాలు 22% వృద్ధితో 2,01,433 యూనిట్లుగా నమోదయ్యాయి. టీవీఎస్‌ మోటార్స్‌ 1,12,238 వాహనాలను (25% వృద్ధి) విక్రయించింది.