Asianet News TeluguAsianet News Telugu

జంగ్ షురూ.. వెహికల్స్ ఓనర్లకు చుక్కలే.. థర్డ్ పార్టీ బీమా అంటే సవాలే

ఇక నుంచి థర్డ్ పార్టీ బీమా అమలు చేయాలంటే వాహనాల కొనుగోలుదారులకు కష్టాలు మొదలు కానున్నాయి. ఇందుకోసం బీమా ప్రీమియం పెంచాలని భారత బీమా నియంత్రణ, అభివ్రుద్ధి, సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. ఈ నెల 29లోగా సూచనలు, సలహాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాతే బీమా ప్రీమియం పెంపు అమల్లోకి వస్తుంది.

IRDAI's new circular addresses communication concerns of policyholders
Author
New Delhi, First Published May 21, 2019, 2:46 PM IST

న్యూఢిల్లీ: రోడ్డు మీద తిరిగే ప్రతి వాహనానికీ కచ్చితంగా థర్డ్‌ పార్టీ బీమా ఉండాల్సిందే. ఈ తప్పనిసరి బీమా ప్రీమియం పెంచేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రతిపాదించింది.

దీంతో కార్లు, టూవీలర్లు, రవాణా వాహనాలపై థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ప్రీమియం రేట్ల పెంపును భారత బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. 

దీని ప్రకారం 1000 సీసీకన్నా తక్కువ ఇంజన్‌ సామర్థ్యం కల కార్ల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం రేట్లను రూ.1,850 నుంచి రూ.2,120కి పెంచాలని ప్రతిపాదించింది. 1,000-1,500 సీసీ మధ్య ఉండే కార్ల ప్రీమియం పెంపు ప్రతిపాదన రూ.3,300గా ఉంది. ఇంతకు ముందు ఇది రూ.2,863గా ఉండేది. 

1,500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్‌ సామర్థ్యం కలిగిన లగ్జరీ కార్ల థర్డ్‌ పార్టీ ప్రీమియం మాత్రం మార్చలేదు. ప్రస్తుతం ఈ ప్రీమియం రూ.7,890గా ఉంది. 75 సీసీకన్నా తక్కువ ఉన్న టూవీలర్ల ప్రతిపాదిత థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.427 నుంచి రూ.482కు చేరింది. 

75సీసీ నుంచి 350 సీసీ మధ్య ఉన్న బైకుల బీమా ప్రీమియం పెంచాలని ప్రతిపాదించారు. సూపర్‌ బైకులకు (350 సీసీ ఎగువన) మాత్రం రేట్ల పెంపును ప్రతిపాదించలేదు. సాధారణంగా థర్డ్ పార్టీ బీమా రేట్లను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సవరిస్తారు.

ఈసారి మాత్రం తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పాత రేట్లు కొనసాగుతాయని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన థర్డ్ పార్టీ బీమా ప్రీమియం కొత్త రేట్ల ముసాయిదాను విడుదల చేసిన ఐఆర్‌డీఏఐ.. ప్రతిపాదిత రేట్లపై అన్నివర్గాల వారు మే 29 వరకు అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కల్పించింది.
 
కొత్త కార్లు, టూవీలర్లకు సంబంధించిన సింగిల్‌ బీమా ప్రీమియం రేట్ల (కార్లకు మూడేళ్లు, బైకులకు ఐదేళ్లు)లో ఎలాంటి మార్పు లేదు. ఎలక్ర్టిక్‌ ప్రైవేట్ కార్లు, ఎలక్ర్టిక్‌ టూవీలర్ల మోటార్‌ థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రేట్లకు 15 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ఐఆర్‌డీఏ ప్రతిపాదించింది. 

ఈ-రిక్షాల థర్డ్ బీమా ప్రీమియం రేట్లలో ఎలాంటి మార్పులను ఐఆర్డీఏఐ ప్రతిపాదించలేదు. స్కూల్‌ బస్సుల బీమా రేటు పెరిగే అవకాశం ఉంది. టాక్సీలు, బస్సులు, ట్రక్కుల బీమా పెంపును ప్రతిపాదించారు. ట్రాక్టర్ల బీమా ప్రీమియం కూడా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
 
కాగా ఇన్సూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (ఐఐబీఐ) 2011-12 నుంచి 2017-18 వరకు క్లెయిమ్‌ల చెల్లింపులకు సంబంధించి ఇచ్చిన డేటాకు అనుగుణంగా మోటార్‌ థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రేట్లను ప్రతిపాదించినట్టు ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

అంతేకాదు పాత కార్లు, ద్విచక్ర వాహనాలతోపాటు వాణిజ్య వాహనాలకూ థర్డ్ పార్టీ బీమా  పెంపు వర్తిస్తుందనీ ఐఆర్ఢీఏఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. అప్పుడు ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios