ఫారిన్ కార్లు, బైకులంటే పడిచచ్చిపోతారా.. దిగుమతి సుంకంతో జేబు చిల్లు పడిపోతుందని బాధపడుతున్నారా..? అయితే మీకో శుభవార్త. వాహనాల దిగుమతికి అడ్డంకిగా ఉన్న పలు నిబంధనలను కేంద్రప్రభుత్వం సడలించింది.

ఇక మీదట విదేశీ కార్లు, బైకుల ధరను ఇంజిన్ సామర్ధ్యం ఆధారంగా నిర్ణయించనున్నారు. సవరించిన నిబంధనల ప్రకారం.. 2,500 యూనిట్లకు మించకుండా కార్లను దిగుమతి చేసుకోవచ్చు..ఇక బైకుల విషయానికి వస్తే.. ఏడాదికి 500 వరకు దిగుమతి చేసుకోవచ్చని... దిగుమతి చేసుకునే విదేశీ కార్లకు తప్పనిసరిగా  స్టీరింగ్ కుడి వైపే ఉండాలని విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టరేట్ తెలిపింది.

అలాగే వీటి ధర రూ.28 లక్షల నుంచి రూ.70లక్షలకు మించరాదని.. ద్విచక్ర వాహనాల ఇంజిన్ సామర్ధ్యం 800 సీసీలకు మించకూడదని తెలిపింది. దిగుమతి చేసుకోబోయే వాహనాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలపింది. ఈ ప్రక్రియ మొత్తం కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధనలకు అనుగుణంగా జరగాలని డీజీఎఫ్‌టీ తెలిపింది. ఈ విధానం వల్ల భారత్‌లోనే కార్ల తయారీకి వీలు కలగుతుందని..నిస్సాన్, టయోటా, బెంజ్, బీఎండబ్ల్యూ వంటి దిగ్గజ కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.