న్యూఢిల్లీ: హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా ఇటీవల విడుదల చేసిన విద్యుత్‌ కారు ‘కోనా’ ధర తగ్గించింది. ఇంతకు ముందు ధర రూ.25.3 లక్షలుగా ప్రకటించింది. విద్యుత్ వాహనాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడంతో ఈ ధర రూ.1.58 లక్షలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో విద్యుత్ ‘కోనా’ ధర రూ.23.71 లక్షలకు చేరినట్లు ప్రకటించింది. 

విద్యుత్‌ కార్లపై జీఎస్టీని 18 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రయోజనాన్ని కంపెనీ కస్టమర్లకు బదలాయించింది. తగ్గింపు ధర ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని హ్యుండాయ్‌ వెల్లడించింది. 

ఇప్పటికే ఈ కారుకు 152 బుకింగ్‌లు నమోదయ్యాయని హ్యుండాయ్ తెలిపింది. ప్రస్తుతం కోన 11 నగరాల్లో 15 విక్రయశాలల్లో లభించనుంది. ఇప్పటికే టాటా టిగోర్‌ ఎలక్ట్రిక్‌ మోడల్‌ ధరను టాటా మోటార్స్‌ రూ.80 వేల వరకు తగ్గించిన విషయం తెలిసిందే.

కోనా అనే పేరుతో విద్యుత్ ఆధారిత మోడల్ కారును ఆవిష్కరించిన హ్యుండాయ్ విపణిలో ప్రవేశపెట్టిన 10 రోజుల్లోనే 120 బుకింగ్స్ నమోదు చేసుకుంది. 11 నగరాల పరిధిలో 15 డీలర్ షిప్‌లను కలిగి ఉన్నది. 
అందుకు విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పించడానికి హ్యుండాయ్ మోటార్స్ ప్రాధాన్యం ఇస్తోంది. 39.2 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉన్న హ్యుండాయ్ ‘కోనా’ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 452 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగల మైలేజీ కలిగి ఉంది. 

కోనా మోడల్ కారు 100 కిలోమీటర్ల వేగం అందుకోవడానికి 9.7 సెకన్ల సమయం పడుతుంది. కొనా ఎస్‌యూవీ మోడల్ కారుతోపాటు 3-పిన్ సాకెట్, 7 కిలోవాట్ల ఏసీ వాల్ బాక్స్ చార్జర్ కలిగి ఉంటుంది. దీంతో ఆరు గంటల్లో చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 57 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. 

రూ.80 వేల ధర తగ్గిన ‘ఈ-వెరిటో’ 
మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) సైతం వెరిటో ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ధర రూ.80 వేల వరకు తగ్గించింది. జీఎస్టీ రేట్లలో కోత తర్వాత.. మహీంద్రా ఈ-వెరిటో ధర రూ.10.71 లక్షలుగా ఉంది. త్రిచక్ర ఎలక్ట్రిక్‌ వాహనం ట్రెయో ధరను సైతం కంపెనీ రూ.20 వేల వరకు కోత వేసింది. ప్రస్తుతం ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ.2.05 లక్షలుగా ఉంది.