న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా 5 వేల యూనిట్ల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. జాజ్, సిటీ, సీఆర్-వీ, సివిక్, అకార్డ్‌లకు చెందిన 5,088 యూనిట్లలో ఎయిర్‌బ్యాగ్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

పరిశీలనలో భాగంగా తకాటా డ్రైవర్, ముందుభాగంలో ప్యాసింజర్ వైపు ఉండే ఎయిర్‌బ్యాగ్‌లు సమస్యలు గుర్తించినట్లు, వీటిని దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ఉచితంగా రీప్లెస్ చేసి ఇవ్వనున్నట్లు హోండా కార్స్ తెలిపింది. 

వీటిలో 2007 నుంచి 2013 మధ్య తయారైన 2,099 యూనిట్ల సిటీ సెడాన్ కార్లు ఉండగా, 2003 నుంచి 2008 లోపు 2,577 యూనిట్ల సీఆర్-వీ కార్లు, 2003లో ఉత్పత్తైన 350 యూనిట్ల అకార్డ్, 52 యూనిట్ల సివిక్ సెడాన్, 10 జాజ్ కార్లు ఉన్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో హోండా కార్స్ 2003-06 మధ్య తయారు చేసిన అకార్డ్ మోడల్ కార్లు 3,699 యూనిట్లలో ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్స్ సమస్య తలెత్తడంతో రీకాల్ చేసింది. సాంకేతిక సమస్యలు తలెత్తిన కార్ల యజమానులతో నేరుగా సంప్రదింపులు జరుపుతామని హోండా కార్స్ తెలిపింది. 

కార్ల యజమానులు తమ వద్ద బ్రాండ్ కారు మైక్రో సైట్ నుంచి వచ్చే 17 అంెకల ఆల్ఫా న్యూమరిక్ వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (విన్)ను సంస్థకు పంపినా, సమీప డీలర్‌తో సంప్రదిస్తున్నా రీకాల్ చేసుకోవచ్చునని పేర్కొంది. జూలైలో కార్లను రీకాల్ చేసిన సంస్థల్లో హోండా కార్స్ మూడోవది. ఇంతకుముందు ఫోర్డ్ సంస్థ ఎండీవర్, ఫిగో, ఫ్రీ స్టైల్, అస్పైర్ మోడల్ కార్లను రీకాల్ చేసింది. వోల్వో ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా కార్లు, బారత దేశంలో మూడు వేల యూనిట్లను రీకాల్ చేసింది.