న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ఒక ఏడాది ముందే బీఎస్‌-6 ప్రమాణాలు గల ఇంజిన్‌‌తో కూడిన ‘యాక్టివా 125’ఎఫ్1 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది  సెప్టెంబర్‌ నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. 

ఎప్పుడూ హై అండ్ మోడర్న్ టెక్నాలజీకి పెద్దపీట వేసేందుకు తాము మరోమారు సిద్ధమైనట్లు హెచ్‌ఎంఎస్‌ఐ  ప్రెసిడెంట్‌, సీఈవో మినోరు కటో తెలిపారు. దశల వారీగా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని హెచ్‌ఎంఎస్‌ఐ  ప్రెసిడెంట్‌, సీఈవో మినోరు కటో వెల్లడించారు.

 బీఎస్‌-4తో పోలిస్తే బీఎస్‌-6 యాక్టివా ధర 10 నుంచి 15 శాతం అధికం కాబోతోందని చెప్పారు. ప్రస్తుతం ఈ వెర్షన్‌ స్కూటర్ ధర  రూ.64,733 వరకు ఉండనుంది. బీఎస్‌-6 యాక్టివా 125ను తెస్తున్నందున బీఎస్‌-4 ఇంజిన్‌ కలిగిన యాక్టివా 125 తయారీని కంపెనీ  నిలిపివేయనుందని ఆ కంపెనీ  సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యద్‌వీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. 

కొత్త యాక్టివాలో  కుదుపుల్లేకుండా స్టార్టయ్యే ఇంజిన్‌, ప్రొగ్రామ్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌, డిజిటల్‌ అనలాగ్‌ మీటర్‌ వంటి నూతన వసతులను తీసుకొస్తున్నారు.ముఖ్యంగా నాయిస్‌ లెస్‌  స్టార్టర్‌ మోటార్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌ను క్లస్టర్‌ కొత్త యాక్టివా 125 ఎఫ్‌ 1 స్కూటర్‌లో సరికొత్త ఫీచర్లుగా ఉన్నాయి. 

నూతన బీఎస్ -6 ప్రమాణాలతో కూడిన హోండా యాక్టీవా 125 ఎఫ్1లో సీసీ ఇంజిన్‌, డిస్క్‌బ్రేక్‌  తదితర ఫీచర్లు చేర్చారు. ఇంకా స్టాండ్‌ ఇండికేటర్‌నూ జోడించింది. స్టాండ్‌ వేసి ఉంటే ఇంజిన్‌స్టార్‌ కాదన్నమాట. ఈ స్కూటర్‌పై అలాగే 6 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది.ఈ ఏడాది  సెప్టెంబర్‌ నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. 

అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో భారతదేశంలో భవిష్యత్ పెట్టుబడులు పెట్టే విషయమై పునరాలోచిస్తామని హోండా మోటార్స్ సీఈఓ మినోరు కటో తేల్చి చెప్పారు. 2025 నాటికి 150 సీసీ బైక్‌లను పూర్తిగా విద్యుత్ వినియోగ బైక్‌లుగా మార్చేందుకు 100 శాతం చేంజోవర్ ప్లాన్ అమలులోకి తేవాలని ప్రభుత్వాన్ని ఇంతకుముందే కోరారు. 

వాహనాల విద్యుద్ధీకరణకు సియామ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం, ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు చర్చించాల్సిన అవసరం ఉన్నదని హోండా మోటార్స్ సీఈఓ మినోరు కటో అన్నారు. ఇప్పటికే విద్యుత్ వాహనాల తయారీపై ప్రభుత్వ ప్రతిపాదిత విధానాల పట్ల హీరో మోటో కార్ప్స్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.