ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. హీరో బీఎస్-4 ద్విచక్రవాహనాలపై 15 వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. పలు మోటారు సైకిళ్లపై రూ.10వేలు, స్కూటర్లపై రూ.15 వేల డిస్కౌంట్లను అందిస్తున్నట్లు హీరో మోటో కార్ప్ బుధవారం తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా షోరూమ్‌లు మూసివేసిన కారణంగా స్టాక్‌ను క్లియర్ చేసుకునే క్రమంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై ఈ డిస్కౌంట్లను అందించనుంది.

హీరో మోటోకార్ప్ సుమారు రూ. 600 కోట్ల విలువైన 1.5 లక్షల యూనిట్ల బీఎస్-4 వాహనాల నిల్వలను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) అంచనా ప్రకారం భారతదేశ మంతటా వివిధ డీలర్ల వద్ద కనీసం అమ్ముడుపోని ద్విచక్ర వాహనాలు ఏడు లక్షలు ఉన్నాయి. ఈ వాహనాల విలువ రూ .3,850 కోట్లు. 

ఈ నెల ఒకటో తేదీ నుండి  బీఎస్-4 వాహనాల విక్రయాలను, రిజిస్టేషన్లను సుప్రీంకోర్టు 2018లో నిషేధించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమలవుతున్న 21 రోజుల లాక్ డౌన్ కారణంగా బీఎస్-4 వాహనాల విక్రయాలపై సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత మరో 10 రోజులు విక్రయించడానికి సుప్రీంకోర్టు మార్చి 27న అనుమతించిన సంగతి తెలిసిందే.

అయితే బీఎస్-4 బైక్స్, స్కూటర్లను విదేశాల్లోనైనా విక్రయించాలని హీరో మోటో కార్ప్స్ భావిస్తోంది. అదే సమయంలో ఇంతకుముందు డీలర్లు చెల్లించాల్సిన బకాయిల్లో 25 శాతం వరకు అనుమతించిన హీరో మోటో కార్ప్స్.. నిల్వలు భారీగా ఉండటంతో 50 శాతం రీయింబర్స్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు బీఎస్-6 ప్రమాణాలతో వాహనాలను తయారు చేయటానికి టెక్నాలజీ అప్ గ్రెడేషన్ వల్ల బైక్స్, స్కూటర్ల ధరలను రూ.8000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సరఫరాదారులకు చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. 

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరోమోటో కార్ప్స్ కూడా మార్చి విక్రయాల్లో పూర్తిగా చతికిల పడింది. 2019 మార్చితో పోలిస్తే 42 శాతం సేల్స్ పడిపోయాయి. 2019 మార్చిలో హీరో మోటో కార్ప్స్ మోటారు సైకిళ్లు, స్కూటర్లు 5,81,279 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ ఈ ఏడాది అది 3,34,647 యూనిట్లకు పరిమితమైంది. 

మోటారు సైకిళ్ల విభాగంలో 42.9 శాతం సేల్స్ పతనమయ్యాయి. 2019 మార్చిలో బైక్స్ 5,35,943 యూనిట్లు విక్రయించగా, ఈ ఏడాది అది 3,05,883 యూనిట్లకు పరిమితమైంది. స్కూటర్ల విభాగంలో కాసింత ఉపశమనం లభించింది. గతేడాది స్కూటర్లు 45,336 యూనిట్లు విక్రయిస్తే, ఈ ఏడాది 28,764 యూనిట్లకు పడిపోయాయి.