న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. వాహనాలు.. ప్రత్యేకించి విద్యుత్ వాహనాల కొనుగోలుపై సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌ సమావేశం ఊహించినట్లే  విద్యుత్ వాహనాలు, ఛార్జర్లపై జీఎస్టీ రేటును 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. 

తాజా రేట్లు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్‌ శనివారం ప్రకటించింది. అలాగే స్థానిక అధికారిక యంత్రాంగం విద్యుత్తు బస్సులను అద్దెకు తీసుకున్నట్లయితే వాటిపై జీఎస్టీని మినహాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. 

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీతారామన్‌ ఈ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేపెట్టిన తరవాత జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ కావడం ఇదే తొలిసారి.

షెడ్యూర్‌ ప్రకారం ఈ సమావేశం గత గురువారమే జరగాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఈరోజుకి వాయిదా పడింది. గతేడాది జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో విద్యుత్‌ వాహనాలపై పన్ను తగ్గింపు అంశాన్ని అధికారుల కమిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. 

విద్యుత్ వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి భారీ ఊరటనివ్వనున్నది. విద్యుత్ వాహనాలను వినియోగదారులకు చౌక ధరకే అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నది. దీనికి మద్దతుగా పెట్రోల్, డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తోంది. 

ఎంతో కాలంగా ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు విద్యుత్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. విద్యుత్ వాహనాల కొనుగోలు కోసం చేసే రుణంలో రూ.1.5 లక్షలపై వడ్డీపై పన్ను మినహాయింపు ఇస్తామని నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.