బ్రిటన్‌ ఎలక్ట్రిక్ బైకుల లైఫ్‌ స్టైల్‌ బ్రాండ్‌ గోజీరో మొబిలిటీ భారత విపణిలో అడుగు పెట్టింది. మైల్‌, వన్‌ పేర్లతో రెండు విద్యుత్‌ బైక్‌లను ప్రవేశపెట్టింది. తయారీ సంస్థ ‘గోజిరో మొబిలిటీ’ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ- ఎలక్ట్రిక్ బైక్‌లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో మైల్ బైక్ ధర రూ.29,999 కాగా, వన్ బైక్ ధర రూ.32,999గా నిర్ణయించారు.

వన్ బైక్ లోని 400 వాట్ల లిథియమ్ బ్యాటరీని ఒక్కసారి రీచార్జి చేస్తే 60 కిలోమీటర్లు,  మైల్ బైక్‌లో ఉన్న 300 వాట్ల లిథియమ్ బ్యాటరీ రీచార్జీతో 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి. విద్యుత్‌ బైకుల అభివృద్ధి, తయారీ కోసం కోల్‌కతాకు చెందిన కీర్తి సోలార్‌తో గోజీరో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ బైక్‌లను భారత్‌, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల కోసం రూపొందించారు. భవిష్యత్‌లో విడుదల చేయబోయే ఉత్పత్తుల్ని కూడా ఇక్కడే అభివృద్ధి చేసి, తయారు చేస్తారని సమాచారం. 

గోజిరో మొబిలిటీ సీఈవో అంకిత్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్‌తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉంటుందన్నారు.

తొలి ఏడాది 3000 మోటారు సైకిళ్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని 75 వేలకు పెంచనున్నట్లు గోజిరో మొబిలిటీ సీఈవో అంకిత్ కుమార్ ప్రకటించారు. ఈ రెండు మోడళ్లతోపాటు డెలివ్ ఆర్, వన్ డబ్ల్యూ, జిరో స్మార్ట్ బైకులను కూడా అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 

ఈ బైకులను విక్రయించడానికి ప్రీమియం రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు గోజిరో మొబిలిటీ సీఈవో అంకిత్ కుమార్ ప్రకటించారు. తొలి విడుతలో ఢిల్లీ, కోల్‌కతా, గువాహటిలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో 18 సెంటర్లను ఏర్పాటు చేయనున్నది సంస్థ. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో ప్రతియేటా 20 వేల బైకులు ఉత్పత్తి కానున్నాయి.