న్యూఢిల్లీ: దేశీయంగా సామూహికంగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే విషయమై ప్రభుత్వం ఆచితూచీ స్పందిస్తూ ‘రియలిస్టిక్’ రోడ్ మ్యాప్ రూపొందించాలని హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్ డిమాండ్ చేశారు. పారిశ్రామికంగా కీలక భూమిక వహించడంతోపాటు దేశ జీడీపీలో గణనీయ పాత్ర వహించనున్నది విద్యుత్ వాహనాల వినియోగం. అలాగే భారీస్థాయిలో ఉద్యోగాలు లభిస్తాయి. 

ఆటోమేటిక్ ఎకో సిస్టమ్ అలవరుచుకోవడానికి వీలుగా ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీస్‌ను వాడకాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కర్బన ఉద్గారాల నియంత్రణతోపాటు విద్యుత్ వాహనాల వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని భారత్ నిర్ణయించిందని పవన్ ముంజాల్ తెలిపారు. 

కానీ విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తే ఆటోమొబైల్ పరిశ్రమపై, దానిపై ఆధారపడ్డ లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పవన్ ముంజాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ వాహనాల వినియోగంపై ఆచితూచి రియలిస్టిక్ రోడ్ మ్యాప్ అమలులోకి తేవాలని పవన్ ముంజాల్ సూచించారు. 

ఇందుకోసం అన్ని వర్గాల వారి మద్దతు కూడగట్టాల్సి ఉన్నదని పవన్ ముంజాల్ చెప్పారు. అయితే ఇప్పటికే బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్, టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కూడా ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్స్ వినియోగంపై ఇవే అభిప్రాయాలు తెలిపారు.

దేశీయంగా విద్యుత్ వాహనాల వినియోగంపై దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ ఇండియా ఎండీ ఎస్ఎస్ కిమ్ కూడా స్పందించారు. ప్రభుత్వం నిర్ధిష్ట గడువుతోపాటు స్పష్టత కలిగి ఉండాలని సూచించారు. అదే సమయంలో మొబిలిటీ ప్లాట్‌ఫామ్స్  ‘ఓలా’, ‘ఉబేర్’ల్లో విద్యుత్ వాహనాల వినియోగం విషయమై స్పష్టత కావాలని కోరారు. 

ప్రభుత్వం నిర్దేశిత ప్రణాళిక ప్రకారం 2026 ఏప్రిల్ నాటికి ఉబేర్, ఓలా క్యాబ్స్‌ను 40 శాతం విద్యుత్ వినియోగ వాహనాలుగా మార్చాల్సి ఉంటుంది. 2021 నాటికి 2.5 శాతం, 2022 నాటికి 5, 2023 నాటికి 10 శాతానికి విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో స్పష్టతతో కూడిన దీర్ఘ కాలిక ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని హ్యుండాయ్ మోటార్స్ ఇండియా ఎండీ ఎస్ఎస్ కిమ్ స్పష్టం చేశారు.

సమీప భవిష్యత్‌లో హ్యుండాయ్ 38 క్లీనర్ వెహికల్ సొల్యూషన్స్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నది. ఇందుకోసం 300 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతోంది. ఓలా కోసం విద్యుత్ వినియోగ వెహికల్‌ను డెవలప్ చేస్తోంది. త్వరలో విడుదల కానున్న హ్యుండాయ్ విద్యుత్ ఎస్ యూవీ ‘కొనా’ తొలుత 16 నగరాల పరిధిలో విక్రయిస్తారు.