న్యూఢిల్లీ: ప్రభుత్వ శాఖలు విద్యుత్‌ వాహనాలు సమీకరించాలన్న విధానంతో ఆ వాహనాల తయారీకి, ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం అందడంతో పాటు కాలుష్యం కూడా అదుపులోకి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఆర్థిక శాఖలో అధికారుల వినియోగానికి  వీలుగా 15 విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టిన సందర్భంగా జైట్లీ మాట్లాడారు.

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు విడుదల చేస్తున్న ఉద్గారాలతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఒకవేళ విద్యుత్‌ వాహనాలకు అందరూ మారగలిగితే కాలుష్యాన్ని చాలావరకు నియంత్రించవచ్చునన్నారు.

విద్యుత్‌ శాఖ ఆధీనంలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌తో ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ) ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే సమయంలో ఈ వాహనాలను ఛార్జింగ్‌ చేసేందుకు వీలుగా నార్త్‌ బ్లాక్‌లో 28 ఛార్జింగ్‌ పాయింట్లను కూడా ఏర్పాటు చేసింది.

అశోక్‌ లేలాండ్‌కు భారీ ఆర్డర్లు
హిందుజా గ్రూప్‌ ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌కు భారీ ఆర్డర్లు దక్కాయి. చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్, ఉత్తర ప్రదేశ్‌ స్టేట్‌ రోడ్‌వేస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్, చండీగఢ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థల నుంచి ఆర్డర్లు లభించాయని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఈ సంస్థల నుంచి మొత్తం 2,580 బస్సులకు ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఎండీ వినోద్‌ కె దాసరి చెప్పారు.

ఈ బస్సులను మరో రెండు నెలల్లో అందజేయాల్సి ఉంటుందని అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కే దాసరి అన్నారు.  ఉన్నతమైన సాంకేతిక విలువలతో, నవకల్పనలతో బస్సులను తయారు చేయడం వల్ల భారత బస్సు మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నామని వివరించారు.