Asianet News TeluguAsianet News Telugu

‘ఆటో’పై జీఎస్టీ తగ్గింపు: నిర్మలమ్మ సంకేతాలు

ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మిలీనియల్స్ సొంత వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వక పోవడం కూడా ఆటోమొబైల్ రంగ సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ లో  ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న శ్లాబ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చారు. 

finance minister, nirmala sitaraman, hints, gst rate cut, automobiles,
Author
Hyderabad, First Published Sep 11, 2019, 11:04 AM IST

చెన్నై: మిలీనియల్స్ మైండ్‌సెట్ మారడం వల్లే ఆటోమొబైల్ రంగంలో మందగమనానికి నిన్నటి తరం యువత ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు కూడా కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. సొంత కార్ల కంటే అద్దె కార్లకే మిల్లేనియల్స్ మొగ్గు చూపుతున్నారని.. ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకుని ప్రయాణించడమే సులభమని భావిస్తున్నారని అన్నారు.

1980 - 2000 మధ్య జన్మించిన వారిని మిల్లేనియల్స్ అంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 20-40 ఏళ్ల మధ్య వయస్కులైన వీరంతా కూడా నెలసరి వాయిదా పద్ధతుల్లో చెల్లించి కార్లు కొనేందుకు ఆసక్తి చూపడం లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. 

ఈనాటి ఆటో రంగ సంక్షోభానికి బీఎస్-6 నిబంధనలు, రిజిస్ట్రేషన్ సంబంధిత అంశాలతోపాటు మిల్లేనియల్స్ మైండ్‌సెట్‌లో మార్పు ప్రధాన కారణాలని ఆమె అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాల్లో మెట్రో సర్వీసులనూ బాగానే వాడుకుంటున్నారని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆటోమొబైల్ రంగానికి ఊరట నిచ్చేందుకు సిద్దంగా ఉన్నారని సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు జీఎస్టీ రేటును తగ్గించాలని వాహన సంస్థలు చేస్తున్న డిమాండ్‌పై వచ్చేవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఆటోమొబైల్ సంస్థల డిమాండ్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నదని, దీంట్లోభాగంగా జీఎస్టీ కౌన్సిల్ కూడా తనవంతుగా రేటును తగ్గిస్తాదని అనుకుంటున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం కార్లపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీ రేటును 18 శాతం తగ్గించాలని వాహన సంస్థలు కోరుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 20న గోవాలో జరుగనున్న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

మాంద్యం దెబ్బకు ఆటోమొబైల్ రంగంతోపాటు ఇతర రంగాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పటికే గడిచిన రెండు నెలల్లో రెండు కీలక నిర్ణయాలు (బ్యాంకుల విలీనం, పలు రంగాల్లో ఎఫ్‌డీఐల పరిమితులు ఎత్తివేయడం) తీసుకున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు. 

ఆగస్టు నెలలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 31.6 శాతం తగ్గి 1,96,524 యూనిట్లకు పరిమితమైనట్లు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వెల్లడించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహన అమ్మకాలు కూడా 22.24 శాతం క్షీణించి 1,514,196లకు పడిపోయాయి. అమ్మకాలు పడిపోవడంతో అన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ వాహన ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios