న్యూఢిల్లీ: ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఫేమ్) స్కీంకు కేంద్ర ప్రభుత్వం వచ్చే మార్చి 31వ తేదీ లోపు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. కాలుష్య నియంత్రణ లక్ష్యంగా.. కర్బన ఉద్గారాల తగ్గింపునకు హైబ్రీడ్, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందించే దిశగా కేంద్రం అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ఫేమ్’ మలి విడత కార్యక్రమాల కోసం రూ.5,500 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నదని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఏఆర్ సిహాగ్ తెలిపారు. 

‘ఫేమ్’ పాలసీ ఐదేళ్లపాటు అమలులో ఉంటుంది. ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ద్విచక్ర వాహనాల్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడతుంది. ఈ ఏడాది చివరికల్లా జాతీయ రహదారులపై 300 విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యం. ప్రత్యేకించి ఢిల్లీ- జైపూర్ - ఆగ్రా హైవే, ముంబై- పుణె హైవేల మధ్య వీటిని ఏర్పాటు చేస్తారు. లాడ్ యాసిడ్ బ్యాటరీల నుంచి అడ్వాన్సుడ్ బ్యాటరీల వైపు మళ్లాలన్నదే తమ వ్యూహం అని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఏఆర్ సిహాగ్ తెలిపారు. 

ఈ పాలసీ కింద తొలిదశలో ఆర్టీసీ బస్సుల విద్యుద్ధీకరణపైనే ఫోకస్ చేయనున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 44 నగరాల పరిధిలో 3,144 బస్సుల విద్యుద్ధీకరణ ప్రతిపాదనలు వచ్చాయి. ఈ క్రమంలో ఆకాంక్ష పరుల డిమాండ్లన్నీ నెరవేర్చడం కష్ట సాధ్యమేనని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఏఆర్ సిహాగ్ తెలిపారు. ప్రత్యేకించి విద్యుత్ వాహనాల వినియోగంపై పన్ను రాయితీలు ఉంటాయన్నారు. కానీ హైబ్రీడ్ వెహికల్స్‌కు పన్ను రాయితీలపై స్పందించడానికి నిరాకరించారు. 

సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన నేపథ్యంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందించే ‘ఫేమ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడమే చాలా కీలకం కానున్నది. క్లీనర్ మొబిలిటీ పథకాన్ని అమలు చేస్తుందా? లేదా? చూడాల్సిందే. ఇక ‘ఫేమ్’ తొలి దశ పథకం అమలును రెండేళ్లలో నాలుగుసార్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొలుత నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2017 మార్చి నెలాఖరుతో ‘ఫేమ్’ తొలి దశ ముగిసిపోవాల్సి ఉంటుంది. తొలుత రూ.795 కోట్లు, తర్వాత రూ.100 కోట్లు ఈ పథకం అమలుకు కేంద్రం కేటాయించిన నిధులు.