న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల ప్రభుత్వ రంగ చార్జింగ్ స్టేషన్లలో చైనా, జపాన్ టెక్నాలజీలను ఇన్ స్టాల్ చేయాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఇప్పటివరకు ఏ దేశ టెక్నాలజీని వినియోగించాలన్న అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెర పడింది. ప్లగ్‌లు, కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్‌ను లింక్ బ్యాటరీలతో అనుసంధానించడం వల్ల వ్యయం తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెప్పారు. 

తద్వారా వివిధ ప్రభుత్వ శాఖల వినియోగానికి అవసరమైన విద్యుత్ వాహనాలను సేకరించనున్న ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) మార్గం సుగమమైంది. దీనివల్ల చార్జింగ్ స్టేషన్ల వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

మున్ముందు 20 వేల విద్యుత్ వినియోగ కార్లకు డిమాండ్ ఉంటుందని అంచనా. తదనుగుణంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రమాణాల రూపకల్పనపైనే కేంద్ర ప్రభుత్వం ద్రుష్టిని కేంద్రీకరించింది. 

విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రమాణాలను ఖరారు చేయకుండా, విద్యుత్ వినియోగ కార్ల కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల 10 వేల ఎలక్ట్రిక్ సెడాన్ కార్ల కొనుగోలు కోసం జారీ చేసిన టెండర్లను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. తాజాగా సవరించిన ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశ మార్కెట్లోకి విద్యుత్ వాహనాలను అనుమతినిచ్చింది. 

ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా నగరాల పరిధిలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారులకు ఇరువైపులా ప్రతి 25 కి.మీ.లకు ఒకటి చొప్పున చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యుత్ వాహనాలకు చార్జింగ్ చేసిన విద్యుత్ వినియోగంపై వ్యయం కంటే 15 శాతం మించరాదన్నది ప్రభుత్వ నిబంధన. 

అన్ని చార్జింగ్ స్టేషన్లకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని ఈఈఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరబ్ కుమార్ తెలిపారు. నిజంగా ఉత్పాదక సంస్థలను ప్రోత్సహించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. 

ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా బేసిక్ విద్యుత్ సెడాన్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. నిస్సాన్, కియా మోటార్స్ వంటి విదేశీ సంస్థలు కూడా ప్రభుత్వం ప్రకటించిన టెండర్లలో భాగస్వామ్యం కానున్నాయి. సుజుకి, టయోటా వంటి జపాన్ కార్ల తయారీ సంస్థలు కంబైన్డ్ చార్జింగ్ సిస్టమ్ (సీసీఎస్) వాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో 15 దేశాల్లో ఈ సీసీఎస్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. 

సీసీఎస్, చాడె-మో వ్యవస్థల ఏర్పాటు వల్ల అనివార్యంగా మౌలిక వసతుల వ్యయం పెరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రశ్రేణి వాహన పరికరాల తయారీ దారులు సీసీఎస్ కు మద్దతుగా నిలిచేందుకు ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. అయితే ప్రస్తుతానికి భారత దేశంలోని చార్జింగ్ స్టేషన్లకు సంబంధించి ఇదంతా తాత్కాలికమే.. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడలేవని నిపుణులు చెబుతున్నారు.