Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ వాహన రంగం: పొంచి ఉన్న టాలెంటెడ్ ఇంజినీర్ల కొరత

సమీప భవిష్యత్‌లో రోడ్లపై విద్యుత్ వాహనాలే పరుగులు తీయనున్నాయి. ఆ వాహనాల తయారీ.. వాటి విడి భాగాల తయారీలో ఆటోమొబైల్ రంగం ప్రతిభావంతులైన విద్యుత్ ఇంజినీర్ల కొరతను ఎదుర్కొంటున్నది. రెండేళ్లలో 15 వేల మంది విద్యుత్ ఇంజినీర్లు అవసరం కాగా, ఐదు వేల మంది కొరత తలెత్తుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే టాటా మోటార్స్ స్వయంగా నిపుణుల తయారీపైనే ద్రుష్టి సారించింది. 

Electric vehicle makers face shortage of engineers  vehicles
Author
New Delhi, First Published Sep 16, 2018, 3:19 PM IST

భూతాపం నివారణ కోసం యావత్ ప్రపంచం పరుగులు తీస్తోంది. నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం ముందుకెళుతోంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ఆధారిత ఇంధన వినియోగ వాహనాల స్థానే ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల ఉత్పత్తి కోసం ఆటోమొబైల్ సంస్థలు బారులు తీరాయి. రకరకాల వ్యూహాలు, డిజైన్లతో రంగం సిద్ధం చేస్తున్నాయి. కానీ విద్యుత్ వినియోగ వాహనాల తయారీ, వాటి మరమ్మతుకు అవసరమైన నిపుణులైన ఇంజినీర్ల కొరత ఉంటుందని కంపెనీల ఎగ్జిక్యూటివ్‪లు, నియామక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ప్రస్తుతం విద్యుత్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజినీరింగ్ రంగంలో 5,000 మందికి పైగా ఇంజినీర్ల కొరత ఉంది. వచ్చే రెండేళ్లలో 15 వేల మందికి పైగా ఇంజినీర్ల కొరత ఏర్పడుతోందని టీమ్ లీజ్ సంస్థ పేర్కొంది. భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ, దాని అనుబంధ పరిశ్రమలకు సుమారు 1000 మంది ఇంజినీర్లు అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

టాటా మోటార్స్, మెర్సిడెస్- బెంజ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి తదితర కార్ల తయారీ సంస్థలు భారతదేశంలో ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థల నుంచి ప్రతిభావంతులైన విద్యుత్ ఆధారిత టెక్నాలజీ సామర్థ్యం గల ఇంజినీర్ల కోసం బారులు తీరాయి. ఇక టాటా మోటార్స్ సంస్థ సొంతంగా విద్యుత్ వాహనాల నిపుణులను తయారు చేస్తోంది. 

మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాజేశ్వర్ త్రిపాఠి ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రతిభావంతులైన విద్యుత్ వాహనాల నిపుణుల నియామకం అతిపెద్ద సవాల్‌గా పరిణమించింది. పరిశ్రమలో విద్యుత్ వాహనాల రంగం ఆవిర్భవిస్తున్నది. నిజమైన ప్రతిభావంతుల కోసం డిమాండ్ పెరుగుతోంది’ అని తెలిపారు. 

డ్రైవర్ రహిత కార్లు, ట్రక్కుల రాకతో కర్బన ఉద్గారాల నియంత్రణకు మార్గం సుగమం కానున్నది. 

ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీ, విద్యుత్ వాహనాల తయారీపై విధానాన్ని రూపొందించనున్నట్లు గతవారం ఢిల్లీలో జరిగిన మొబిలిటీ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రకటించారు. విద్యుత్ వినియోగ వాహనాల తయారీ, చార్జీంగ్ మౌలిక వసతుల కల్పన కోసం పెట్టుబడులు పెట్టాలని ఆటోమొబైల్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. 

ఇదిలా ఉండగా జూన్ నెలతో ముగిసిన త్రైమాసికం నాటికి మహీంద్రా విద్యుత్ వాహనాల విభాగంలో ఉద్యోగం కోసం వివిధ డిజిటల్ వేదికల నుంచి 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరినీ ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లో నియమించుకోవాలని భావిస్తోంది మహీంద్రా అండ్ మహీంద్రా. అంతర్జాతీయంగా ప్రతిభావంతుల కోసం మహీంద్రా అండ్ మహీంద్రా అన్వేషణ సాగిస్తోంది. 

కానీ ప్రస్తుత అవసరాల్లో కేవలం 30 శాతం మందిని మాత్రమే నియమించుకోగలమని మహీంద్రా ప్రతినిధి త్రిపాఠి పేర్కొన్నారు. 

వచ్చే రెండేళ్లలో విద్యుత్ ఇంజినీర్ల డిమాండ్ మూడు రెట్లు పెరుగుతున్నదని టీమ్ లీజ్ సహ వ్యవస్థాపకులు రితుపర్ణ చక్రవర్తి చెప్పారు. 15 వేల మందికి 10 వేల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. 

ఈ వ్యత్యాసాన్ని తక్షణం తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమలో ఐటీ, విద్యుత్ వినియోగ సామర్థ్యం గల ఇంజినీర్లను 30 శాతం మందిని నియమించుకునేందుకు ఆయా సంస్థలు సిద్దం అవుతున్నాయి. 

అయితే ప్రస్తుతం భారతదేశంలోని ఆటోమొబైల్ సంస్థలన్నీ దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, జాతీయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు, కేంద్ర ప్రభుత్వ నిధులతో పని చేస్తున్న స్కూళ్లలో నిపుణుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 

మెర్సిడెజ్-బెంజ్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ కొన్ని సంస్థలతో ముందస్తుగానే ఒప్పందం చేసుకుని, ఆయా సంస్థల్లోని విద్యార్థుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో బెంగళూరులో మెర్సిడెజ్- బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఇండియా పేరిట జర్మనీ తర్వాత ఏర్పాటైన అతిపెద్ద పరిశోధన సంస్థగా నిలిచింది. 

సుస్థిర రవాణా వ్యవస్థ కోసం టాటా మోటార్స్ పని చేస్తోంది. వివిధ సంస్థల క్యాంపస్‌ల్లో ప్రతిభావంతుల కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు టాటా మోటార్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఏకకాలంలో ప్రతిభావంతులను అభివ్రుద్ధి చేయడంతోపాటు టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం బెటరని తెలిపారు. స్థానికులతో ప్రతిభావంతుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఇక మారుతి సుజుకి సంస్థ వచ్చే రెండేళ్లలో విద్యుత్ వాహనాలను మార్కెట్‌లోకి తేవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios