Asianet News TeluguAsianet News Telugu

భళిరా భళి: టాప్ 10లో మారుతివే ఎనిమిది మోడల్స్

మే నెలలో అమ్ముడైన ప్రయాణ కార్లలో మారుతి సుజుకి మోడల్స్ ఎనిమిది టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాయి. 

Eight Maruti Suzuki models among top 10 best selling PVs in May
Author
New Delhi, First Published Jun 25, 2019, 2:48 PM IST

న్యూఢిల్లీ: దేశీయంగా వాహనాల విక్రయాల్లో అనిశ్చితి కొనసాగుతున్నా.. అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మే నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన మొదటి పది ప్యాసింజర్‌ వాహనాల జాబితాలో మారుతీ సుజుకీ ఇండియాకు చెందినవే ఎనిమిది మోడల్స్‌ ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా ఆటోమొబైల్‌ రంగంలో అమ్మకాల్లో కాస్త తగ్గుదల నమోదైనా మారుతీ ఈ ఘనతను సాధించడం గమనార్హం. గత ఏడాది ఇదే నెలలో 19,208 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో ఉన్న మారుతీ స్విఫ్ట్‌ 2019లో 17,039 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచి ఈ ఏటి బెస్ట్‌ సెల్లింగ్‌ వాహనంగా ఘనత సాధించిందని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ తయారీదారులు (ఎస్‌ఐఏఎం) ఒక ప్రకటనలో వివరాలను ప్రకటించింది.

మారుతీ స్విఫ్ట్‌ తర్వాత 16,394 యూనిట్ల విక్రయాలతో ఎంఎస్‌ఐ ఎంట్రీ లెవెల్‌ ఆల్టో రెండో స్థానం దక్కించుకుంది. గత కొన్ని నెలలుగా తొలి స్థానంలో ఉన్నది ఆల్టో. గత ఏడాది ఇదే నెలలో మొదటి స్థానంలో నిలిచిన కంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ ఈ ఏడాది 16,196 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానానికి పడిపోయింది. 

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో (15,176 యూనిట్లు) నాలుగో స్థానానికి వేగనార్‌ 14,561 యూనిట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాయి. ఇక టాప్-10 జాబితాలో మారుతికి చెందిన యుటిలిటీ వ్యాన్ ఈకో 11,739 యూనిట్ల విక్రయంతో తొలిసారి ఆరో స్థానంలో నిలచింది. 

ఏడో స్థానంలో హ్యుండాయ్‌ మోటార్స్‌ ఇండియాకు చెందిన ఎస్‌యూవీ క్రెటా (9,054 యూనిట్లు), ఎనిమిదో స్థానంలో ఎలైట్‌ ఐ20 (8,958 యూనిట్లు), మారుతికి చెందిన మల్టీ-పర్పస్ వాహనమైన ఎర్టిగా 8,864 యూనిట్ల విక్రయంతో తొమ్మిదోస్థానంలో ఉన్నాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తెలిపింది. 

ఇంకా విటారా బ్రెజ్జా (మారుతి) 8,781 యూనిట్ల విక్రయంతో టాప్ 10 స్థానాన్ని సొంతం చేసుకున్నది. గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 18 ఏండ్ల కనిష్ఠ స్థాయి 2,39,347 యూనిట్లకు పడిపోయాయి.

Follow Us:
Download App:
  • android
  • ios