అత్యాశ కారణంగా బజాజ్ సంస్థ మోటార్ సైకిల్ శ్రేణిలో  భారీగా నష్టపోవాల్సి వచ్చిందని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ పేర్కొన్నాడు. ఐదేళ్ల క్రితం తాము చేసిన ఆ ఒక్క తప్పు చేయకుంటే టూవీలర్స్ శ్రేణిలో బజాజే మొదటిస్థానంలో ఉండేదన్నారు. అలాంటి తప్పులు మరోసారి జరక్కుండా జాగ్రత్తపడుతున్నా గతంలో  చేసిన తప్పిదమే బజాజ్ ను ఇంకా వెంటాడుతోందని రాజీవ్ పేర్కొన్నాడు. 

ఇంతకు బజాజ్ సంస్థ తీసుకున్న అంతపెద్ద తప్పుడు నిర్ణయం  ఏమిటో రాజీవ్ మాటల్లోనే తెలుసుకుందాం.   ‘‘బజాజ్ సంస్థ మొదట 125సిసి వేరియంట్ బైక్‌ని భారత మార్కెట్లోకి విడుదలచేసింది. అయితే ఊహకందని  రీతిలో ఈ మోడల్ బైక్‌లు అమ్ముడుపోయి తమను ఆశ్యర్యానికి గురిచేశాయి. దీంతో తమ మార్కెటింగ్ సిబ్బందిలో కొత్త ఆలోచన మొదలయ్యింది. డిస్కవర్ 125సిసి మోడలే ఇంతలా అమ్ముడుపోతే...మధ్యవయస్కులకు ఉపయోగపడేలా 100సిసి ని మార్కెట్లోకి తీసుకువస్తే మరింత ఎక్కువగా సేల్స్ పెరిగే అవకాశం ఉందనేది వారి ఆలోచన. దీంతో వారి ఆలోచనకు తగ్గట్లుగానే 100 సిసి ప్రవేశపెట్టాం. కానీ తమ అంచనాలు తలకిందులై ఈ వేరియంట్ బైక్స్ అమ్మకాల్లో ఘోరంగా విఫలమయ్యాం. ఆ ప్రభావం బజాజ్ సంస్థపై ఇంకా వెంటాడుతూనే ఉంది.''అని రాజీవ్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ వెల్లడించారు. 

ఈ తప్పిందం వల్ల మోటార్ సైకిళ్ల విభాగంలో నెంబర్1 స్థానంలో ఉండాల్సిన బజాజ్ సంస్థ నెంబర్2 కి పరిమితమవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ ప్రభావం నుండి బైటికిరాలేక పోతున్నామని రాజీవ్ బజాజ్ తెలిపాడు.