న్యూఢిల్లీ: గతనెలలో దేశీయ ఆటోమొబైల్ సేల్స్‌లో ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి  అతి స్వల్పంగా 0.2 శాతం పురోగతితో మొదటి స్థానంలో ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న మారుతి సుజుకి గత నెలలో ఎక్కువగా అమ్ముడు పోయిన మోడల్ కార్లపై భారీగా ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. కారు మోడల్‌ను బట్టి రూ.13 వేల నుంచి రూ.63 వేల వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. 

మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘ఆల్టో 800’కొనుగోలు చేసిన వారికి సంస్థ రూ.53 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది. పెట్రోల్ వేరియంట్ మోడల్ కారుపై రూ.53 వేలు, సీఎన్జీ వేరియంట్ కారు ధరపై రూ.43 వేల డిస్కౌంట్ అందిస్తోంది. మారుతి ఆల్టో 800 ప్రత్యర్థి సంస్థలు రెనాల్ట్ క్విడ్, డస్తన్ రెడిగో మోడల్ కార్లతో తలపడనున్నది. 

ఆల్టో 800 మోడల్ అనుబంధ కారు ఆల్టో కే10 పెద్దదిగా ఉంటంతోపాటు ఏఎంటీ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు ఆల్టో 800 కంటే మెరుగైన డిస్కౌంట్ రూ.58 వేల వరకు అందుబాటులో ఉంది. పెట్రోల్ వినియోగ కారుపై రూ.53 వేలు, సీఎన్జీ మోడల్ కార్లపై రూ.48 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

సెలిరియోపై రూ.63 వేల వరకు రాయితీ కల్పిస్తోంది మారుతి సుజుకి. ఈ మోడల్ కారు దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ సాంత్రోను ఢీకొడుతోంది. ఏఎంటీ వేరియంట్లపై రూ.63 వేల వరకు బెనిఫిట్లు లభిస్తుండగా, పెట్రోల్, సీఎన్జీ వేరియంట్ మోడళ్లపై రూ.58 వేల నుంచి రూ.48 వేల వరకు రాయితీ అందుబాటులో ఉంటుంది. ఆల్టో కే 10, వాగన్ ఆర్ మోడల్ కార్లతో పోలిస్తే స్మూత్ గా వెళ్లిపోయే కారు సెలిరియో.

సెలిరియో ఎక్స్ మోడల్ కారుపై రూ.53 వేల వరకు ఆదా చేయొచ్చు. ఏఎంటీ వేరియంట్ కార్లపై రూ.53 వేలు.. మిగతా వాటిపై రూ.48 వేల వరకు రాయితీలు లభిస్తాయి. మూడోతరం కారు స్విఫ్ట్ కొనుగోలుపై రూ.43 వేల రాయితీ లభిస్తోంది. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10, ఫోర్డ్ ఫిగో మోడల్ కార్లతో ఇది తలపడనున్నది. 

సెడాన్ మోడల్ కారు డిజైర్‌పై రూ.58 వేల డిస్కౌంట్ లభిస్తోంది. ఇది హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్ పేస్ లిఫ్ట్ మోడల్ కార్లతో తలపడనున్నది. మారుతి సుజుకి విటారా బ్రెజా కారు కొనుగోలుపై రూ.45 వేల రాయితీ అందుబాటులో ఉంది. విటారా బ్రెజా ప్రత్యర్తి సంస్థలు టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్.. త్వరలో రానున్న మహీంద్రా ఎక్స్ యూవీ 300 మోడల్ కార్లతో తలపడనున్నది.  

ఓమ్నీ కారు కొనుగోలుపై రూ.33 వేల వరకు బెనిఫిట్లను మారుతి సుజుకి కల్పిస్తోంది. ఇంకా అప్ డేట్ కానీ ఈ మోడల్ కారు స్టాక్స్ క్లియర్ చేయడమే లక్ష్యంగా ఆపర్లు కల్పిస్తోంది మారుతి సుజుకి.  ఎకో మోడల్ కారు కొన్న వారు రూ.13 వేల వరకు రాయితీ పొందొచ్చు. ఈ మోడల్ కారు ప్రస్తుతం రీ మోడలింగ్‌తో ఈ ఏడాది వరకు మార్కెట్లోకి రావచ్చు.