ముంబై: మార్చినెలలో దేశీయ ఆటోమొబైల్‌ రంగంపై కరోనావైరస్‌ ప్రభావం తీవ్రంగానే పడింది. దీంతో ఈ సారి విక్రయాల గణాంకాల్లో భారీ కోత పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం జనతా కర్ఫ్యూ తర్వాత పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో విక్రయాలు నిలిచిపోయాయి. 

గతేడాదితో పోలిస్తే 2020 మార్చిలో వివిధ ఆటోమొబైల్ సంస్థల కార్ల విక్రయాలు 51 శాతం తగ్గాయి. గత కొన్నినెలలుగా ఆటోమొబైల్‌ రంగం కష్టకాలం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జీఎస్‌టీ వచ్చినప్పుడు, నోట్ల రద్దు సమయంలో  కూడా ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ సారి మార్చిలో దాదాపు 1,50,000 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాలు విక్రయించినట్లు అంచనా. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే కేవలం సగం మాత్రమే. 

మరోపక్క వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా భారీగా పడిపోయాయి. మార్చి 31తో బీఎస్‌4 వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిలిపేస్తామని లాక్‌డౌన్‌కు ముందు ప్రకటించడంతో అప్పటికే వీటి విక్రయాలు తగ్గాయి. లాక్‌డౌన్‌ తర్వాత అమ్మాకాలు చేయలేని పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌ తర్వాత కొన్నాళ్లపాటు బీఎస్‌4 వాహనాల విక్రయానికి సుప్రీం కోర్టు అనుమతించడం ఒక్కటే ఊరటనిచ్చే విషయం. 

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ విక్రయాల్లో దాదాపు 47శాతం తగ్గుదల కనిపించింది. గతేడాది మార్చిలో ఈ సంస్థ 1,58,076 వాహనాలను విక్రయించగా ఈ సారి 83,792 వాహనాలే అమ్ముడు పోయాయి. మార్చి 22వ తేదీన ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఉత్పత్తి , విక్రయాలను బంద్‌ చేసింది. ముఖ్యంగా దేశీయ విక్రయాల్లో భారీ తగ్గుదల నమోదు కావడం సంస్థపై ప్రభావం చూపింది. 

దక్షిణ కొరియా ఆటో దిగ్గజం ‘హ్యుండాయ్ మోటార్స్’ సేల్స్ 47.21 శాతం తగ్గుముఖం పట్టాయి. గతేడాది 61,150 యూనిట్లు విక్రయించిన విక్రయాలు.. ఈ ఏడాది 32,279 యూనిట్లకు పరిమితమయ్యాయి. దేశీయంగా 44,350 (2019 మార్చి) వాహనాలు అమ్ముడు కాగా, ఈ ఏడాది 26,300 కార్లే విక్రయించింది. ఇక ఎగుమతులు 64.41 శాతం పడిపోయాయి.

హిందూజాల ప్రముఖ ట్రక్కుల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ వాహనాల విక్రయాల్లో మార్చి నెలలో పూర్తిగా చతికిల పడింది. 2019 మార్చిలో 21,535 యూనిట్లు విక్రయించిన అశోక్ లేలాండ్ గత నెలలో కేవలం 2,179 (90%) యూనిట్లకే పరిమితమైంది. దేశీయంగా 20,521 వాహనాలు విక్రయిస్తే, ఈ ఏడాది మార్చిలో 1787 యూనిట్ల విక్రయానికి పరిమితమైంది. మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ దేశీయ మార్కెట్లో 90 శాతం పడిపోయాయి. 

హోండా కార్స్ ఇండియా (హెచ్సీఐఎల్) ఈ ఏడాది మార్చి నెల దేశీయ విక్రయాలు 78.5 శాతం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. గతేడాది మార్చిలో 17,202 కార్లు విక్రయించిన హోండా కార్స్.. విదేశాలకు 216 కార్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది. 2018-19తో పోలిస్తే 2019-20లో హోండా కార్ల విక్రయం 1,83,808 యూనిట్ల నుంచి 1,02,016 యూనిట్లకు పడిపోయింది. 

మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 88 శాతం పడిపోగా, టాటా మోటార్స్ సేల్స్ 70 శాతం పతనాన్ని నమోదు చేసుకున్నాయి. టాటా మోటార్స్ కేవలం 5,676 యూనిట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా 3,383 కార్లను మాత్రమే విక్రయించగలిగాయి. 

టయోటా కార్ల సేల్స్ 45 శాతం, రెనాల్ట్ కార్ల విక్రయాలు 54 శాతం పడిపోయాయి. టయోటా 7,023 కార్లు విక్రయిస్తే, రెనాల్ట్ కేవలం 3,269 కార్లు మాత్రమే అమ్మగలిగింది. ఫోర్డ్ కార్ల సేల్స్ 58 నెగిటివ్ గ్రోత్ నమోదుతో 3,510 యూనిట్లు మాత్రమే విక్రయించింది. 

స్కోడా విక్రయాలు 68 శాతం తగ్గితే, ఫియట్ సేల్స్ 89 శాతం పడిపోయాయి. డస్టన్ విక్రయాలు 92 శాతం పడిపోతే, వోక్స్ వ్యాగన్ సేల్స్ 95 శాతం తగ్గాయి. ఇక నిస్సాన్ సేల్స్ మాత్రం 31 శాతానికి తగ్గి 673 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మరోవైపు తేలికపాటి వాణిజ్య వాహనాల (ఎల్సీవీస్) విక్రయంపైనా ప్రభావం పడింది. గతేడాదితో పోలిస్తే 62 శాతం విక్రయాలు తగ్గాయి.

రాయల్ ఎన్‍ఫీల్డ్ మోటారు సైకిళ్ల విక్రయాల్లో 41 శాతం క్షీణత నమోదైంది. 2019 మార్చిలో 60,831 మోటారు సైకిళ్లు విక్రయించగా, ఈ ఏడాది 35,814 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.