కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో దేశంలో భారత్‌ స్టేజ్‌-4 (బీఎస్‌-4) వాహనాల అమ్మకంపై వాహనాల తయారీ సంస్థలకు, డీలర్లకు కేంద్ర సుప్రీంకోర్టు ఉపశమనాన్నిచ్చింది. ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే ఉన్న గడువును సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ను ఏప్రిల్‌ 24వ తేదీ వరకు పొడిగించింది. 

ఈ వాహనాల విక్రయాలను మార్చి 31వ తేదీ వరకు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ విషయమై ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా), ఆటోమొబైల్‌ ఉత్పత్తిదారుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ విషయమై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. 

కరోనా వైరస్‌ మూలంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందువల్ల ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత మరో పది రోజుల వరకు బీఎస్‌-4 వాహనాల అమ్మకం కొనసాగించవచ్చని జస్టిస్‌లు అరుణ్‌ మిశ్రా, దీపక్‌ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాగించిన విచారణలో తెలిపింది. 

లాక్‌డౌన్‌ వల్ల డీలర్లు తమ స్టాకును అమ్మడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ షోరూమ్‌లకు కొనుగోలుదారులు రావడంలేదని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. బీఎస్‌-4 ప్రమాణాలతో కూడిన 15 వేల ప్యాసింజర్‌ కార్లు, 12 వేల వాణిజ్య వాహనాలు, ఏడు లక్షల టూ వీలర్లు ప్రస్తుతం పేరుకుపోయాయని తెలిపారు. 

అయితే దేశ పర్యావరణ పరిస్థితిని కూడా పిటిషనర్లు అర్థం చేసుకోవాలని, కరోనా వైరస్‌ను ఉపయోగించుకోవాలని చూడకూడదని జస్టిస్‌లు అరుణ్‌ మిశ్రా, దీపక్‌ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటికే అమ్ముడుపోయిన వాహనాలు లాక్‌డౌన్‌ మూలంగా రిజిస్టర్‌ కాకపోతే లాక్‌డౌన్‌ తర్వాత రిజిస్టర్‌ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. 

అయితే దేశ రాజధాని ప్రాంతం, ఢిల్లీ పరిధిలో మాత్రం బీఎస్-4 వాహనాలను విక్రయించొద్దని స్పష్టం చేసింది. విక్రయించిన 10 రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని తెలిపింది. కరోనా వైరస్ వల్ల వాహనాల విక్రయాలు 70 శాతం పడిపోయాయని, మే 31వ తేదీ వరకు బీఎస్-4 వాహనాల విక్రయాలను చేపట్టేందుకు అనుమతించాలని ఫాడా కోరింది. తొలుత గత నెలలో ఫాడా అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.