సియోల్‌: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్‌ కార్పొరేషన్‌ తక్కువ ధరలకు విద్యుత్తు వాహనాలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం గ్రూప్‌ కంపెనీ అయిన హ్యుండాయ్‌ మోటార్స్‌తో జట్టుకట్టనున్నదని కియా మోటార్స్ అధికారులు తెలిపారు. 

 

వచ్చే రెండేళ్లలో సెల్టోస్‌తో సహా కలిపి నాలుగు మోడళ్లను భారత్‌లో విడుదల చేయనుంది. దీంతోపాటు తక్కువ ధరకు విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెచ్చే మరో ప్రాజెక్టును చేపట్టింది. 

 

'తక్కువ ధరకు విద్యుత్ వాహనాల తయారీ పై మేము చర్యలు చేపట్టాం. హ్యుండాయితో కలిసి భారత్‌ మార్కెట్ కోసం ఒక విద్యుత్ వాహనాన్ని (ఈవీ) అభివద్ధి చేయాలని భావిస్తున్నాం' అని కియా మోటార్స్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, సీఈవో హాన్‌ వూ పార్క్‌ తెలిపారు. విద్యుత్ వాహనాల ప్రాజెక్టు విడి ప్రాజెక్టు అని చెప్పిరు.

 

ఎలక్ట్రిక్‌ వాహనాలను చౌకగా భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ సహకారం కూడా తప్పకుండా కావాల్సి ఉంటుందని కియా మోటార్స్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, సీఈవో హాన్‌ వూ పార్క్‌ తెలిపారు. 


వ్యక్తిగత అవసరాలకు వాడుకునే విద్యుత్ వాహనాల ధరలు భారీగా ఉన్నాయని తెలిపారు.  లేకుంటే ఎక్కువ ధరలు గల ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాబోరని స్పష్టం చేశారు. కనుక ఫేమ్-2 విధానం కింద ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని సూచించారు. త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ సెగ్మెంట్లలో వాణిజ్య అవసరాలకు వాడే వాహనాలకు ఇన్సెంటివ్ లు అందుబాటులో ఉన్నాయి. 10 లక్షల టూ వీలర్స్, ఐదు లక్షల త్రీ వీలర్స్, 55 వేల ఫోర్ వీలర్స్, ఏడు వేల బస్సులకు ఫేమ్ 2 కింద ప్రభుత్వ రాయితీలు లభిస్తాయి. 

 

భారత్‌లో విభిన్న రకాల మోటార్లను ఉత్పత్తి చేస్తామని 2018 ఆటో ఎక్స్‌పోలో కియా ప్రకటించింది. ఇప్పటికే కియామోటార్స్‌ హైబ్రీడ్‌, ప్లగ్‌ ఇన్‌ హైబ్రీడ్‌, ఎలక్ట్రిక్‌, ఫ్యూయల్‌ సెల్‌ వాహనాలను ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తోంది.