న్యూఢిల్లీ:వాతావరణ కాలుష్య కారక పాత వాహనాలపై నిషేధం విధిస్తూ  కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సమాలోచనల్లో పడ్డాయి. 2000 కంటే ముందు రిజిస్టరైన వాహనాల స్థానంలో నూతనంగా వచ్చే వాహనాలపై ఒకేసారి రాయితీ కల్పించాలని కేంద్రాన్ని ప్రభుత్వానికి ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన ముందస్తు సమావేశానికి ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. 

ప్రస్తుతం ప్యాసింజర్ కార్లపై విధిస్తున్న పలు రకాల పన్నులను ఎత్తివేయాలని, విద్యుత్‌తో నడిచే వాహనాలకు ప్రత్యేక రేటును నిర్ణయించాలని సూచించారు. కాలుష్యం తగ్గింపునకు, భద్రత విషయంలో కేంద్రం రాజీ పడటం లేదని ఈ వర్గాలు తెలిపాయి. 15 ఏళ్లకు పైబడిన వాహనాలతోనే 80% కాలుష్యం అవుతున్నదని, అలాగే వీటివల్లే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ప్రధాన ఆరోపణ.

ప్రజా రవాణా వాహనాలతో ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్నదని, ఈ నేపథ్యంలో జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, ఫైనాన్స్‌లను సబ్సిడీలను అందించాలని సూచించింది. ఇదే సమయంలో తనిఖీలను ముమ్మరం చేయడంతోపాటు సర్టిఫికేషన్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఇండస్ట్రీ ప్రతినిధులు కేంద్రానికి సూచించారు. గత ఐదేళ్లలో పన్నులు భారీగా పెంచడంతో ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లోకి జారుకున్నది. 

చిన్న, కమర్షియల్, ద్వి, త్రి చక్ర వాహనాలపై 2011-12లో 10 శాతంగా ఉన్న పన్నులు 2015-16లో 12.5 శాతానికి చేరుకోగా, అతిపెద్ద కార్లపై 22 శాతం నుంచి 30 శాతానికి పెంచారు. వీటితోపాటు అదనంగా ఇన్‌ఫ్రా సెస్‌రూపంలో ఒక శాతం నుంచి నాలుగు శాతం వసూలు చేస్తున్నారు.

ఐదు లక్షల మైలురాయి దాటిన రెనో
దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన స్వల్ప కాలంలోనే ఐదు లక్షల వాహనాలను విక్రయించిన మైలు రాయిని దాటిందని రెనో ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సహానీ తెలిపారు. దేశీయంగా అత్యాధునిక ఉత్పతి కేంద్రాన్ని, రెండు డిజైన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఇండియా కోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసినట్టు ఆయన చెప్పారు. సమీప భవిష్యత్‌లో మరిన్ని కొత్త ఆవిష్కరణలను, సేవలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. 

చిన్న కార్ల విభాగంలో దేశీయంగా తయారు చేసిన క్విడ్ కారు అత్యంత ప్రజాదరణను పొందిందని, ఇప్పటికే 2.70 లక్షల కార్లను విక్రయించడంతో ఇటీవలే ఆటో, మాన్యువల్ టాన్స్‌మిషన్లతో ఫీచర్ లోడెడ్ క్విడ్ కారును ప్రవేశపెట్టామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మరో రెండు డస్టర్ వాహన వేరియంట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. డిసెంబర్ సంబరాల సందర్బంగా కొత్త రేడియంట్ ఎరుపు రంగు క్యాప్చర్ ఎస్‌యువీని 50 రకాల ప్రీమియం ఫీచర్లతో ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. జనవరి నుంచి అన్ని వాహనాల ధరలను 1.5 శాతం మేర పెంచుతున్నట్టు తెలిపారు.