Asianet News TeluguAsianet News Telugu

డిమాండ్ లేక ఆటోపరిశ్రమ విలవిల!

గతంతో పోలిస్తే ఈ ఏడాది కార్లు, మోటారు సైకిళ్లకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది. ఫలితంగా కొనేవారు లేక ఆటోమొబైల్ సంస్థలు వాహనాల ఉత్పత్తిని తగ్గించివేశాయి. ఇది దాదాపు 18 ఏళ్ల కనిష్టానికి స్థాయికి పడిపోయింది. మద్దతు లేక అనుబంధ పరిశ్రమలు మూతపడుతున్నాయి. డీలర్లు కూడా ఆటో బిజినెస్‌ వదులుకునేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే దాదాపు 32,000 కొలువులు పోయాయి. మున్ముందు 5-10 లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనా. 

Auto Industry is Crisis
Author
New Delhi, First Published Jul 31, 2019, 10:41 AM IST

దేశ ఆర్థిక వ్యవస్థను రూ.350 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్తాం అంటున్న మోడీ సర్కార్.. క్షేత్రస్థాయిలోని ప్రతికూల పరిస్థితులను పట్టించుకోవడం లేదు. వినిమయం తగ్గి డిమాండ్‌ పడిపోతుండటంతో ఆటోమొబైల్‌, స్థిరాస్థి రంగాలలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో ఆయా రంగాల్లోకి కొత్త పెట్టుబడులు రావడం లేదు. 

దేశంలో దాదాపు 50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పించే ఆటో మొబైల్‌ రంగంలో సంక్షోభం ముంచుకొస్తున్నది. ఉత్పత్తి గణనీయంగా పడిపోతుండటం, కొనుగోలు చేసేవారు లేక డీలర్లు, వ్యాపారులు కార్ల పరిశ్రమలను తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. దీంతో అనుబంధ పరిశ్రమలు మూత పడుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి గతంతో పోల్చితే గణనీయంగా తగ్గింది.

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కార్లు, ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 18.4 శాతానికి పడిపోయింది. 2000-02 తర్వాత ఇంత తక్కువగా వాహనాల ఉత్పత్తి నమోదవడం ఇదే తొలిసారి. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు.. ఆటోమొబైల్‌, దాని అనుబంధ రంగాలలో మందగమనంతోపాటు జీఎస్టీ భారాన్ని మోయలేక ఆయా సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్టుగా సమాచారం. 

దీనికి తోడు దేశంలో నిరుద్యోగం కూడా గతంలో లేనంతగా పెరిగిపోవడంతో కార్లు కొనేవారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందని ఈ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది రోజుల్లోనే ఆటోమొబైల్‌ రంగంలోని ఈ సంక్షోభంతో దాదాపు 5-10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

మందగమనం వల్ల వాహన అమ్మకాలు పడిపోతుండడంతో దేశవ్యాప్తంగా గడిచిన 18 నెలల్లో 286 మంది డీలర్లు తమ వ్యాపారానికి స్వస్తి పలికారు. ఈ కారణంగా దాదాపు 32 వేల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. కార్ల ఇండస్టీకి ఈ ఏడాది తొలి అంకం కలిసి రాలేదనీ, వచ్చే ఆర్నెళ్లు కూడా ఆశాజనకంగా కనిపించడం లేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ అసోషియేషన్స్‌ (ఫడా) తెలిపింది. 

కాగా, ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న సంక్షోభంపై ప్రముఖ కార్ల మార్కెట్‌ దిగ్గజం మారుతి సుజూకీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ జగదీశ్‌ ఖట్టర్‌ స్పందిస్తూ.. గతంతో పోల్చితే కార్ల ఉత్పత్తిని భారీగా తగ్గించామని చెప్పారు. రెండేళ్ల క్రితం 40 శాతం వరకు డీజిల్‌ వాహనాలు ఉత్పత్తి చేసే వారమనీ, కానీ ప్రస్తుతం అది 20 శాతానికి పడిపోయిందని అన్నారు.

ఆటోమొబైల్‌ రంగంలో తయారయ్యే వస్తువులపై జీఎస్టీ వడ్డన వల్ల ఉత్పత్తి తగ్గుతున్నదని మారుతి సుజుకి ఎండీ జగదీశ్ ఖట్టర్ తెలిపారు. దేశంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం, ఉన్న ఉద్యోగాలు ఊడటంతో కార్లను కొనడానికి ఎవరూ ఆసక్తిని చూపించడం లేదని తెలిపారు.

దేశంలోని ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అసంఘటిత రంగ కార్మికులకు నిత్యం పని కల్పించే స్థిరాస్తి రంగం కూడా మందగమనంలో చిక్కుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బిల్డర్లు కట్టిన పెద్దపెద్ద భవనాలలో ప్లాట్లు కొనేవారు లేక ఖాళీగా మిగిలిపోతున్నాయి. 

ద్వితీయశ్రేణి నగరాల సంగతి దేముడెరుగు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో పాలిటన్‌ నగరాల్లోనూ ఇవే పరిస్థితులున్నాయి. లయాసిస్‌ ఫోరస్‌ అనే సంస్థ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియల్టర్లు కట్టిన దాదాపు 10 లక్షల ఇండ్లు అమ్ముడు పోలేదు.

దీంతో ఈ రంగంలో సుమారు రూ.6 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టిన బిల్లర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముంబయిలో లగ్జరీ ఇండ్లు కొనేవారితో పాటు రెండోస్థాయి పట్టణాల్లో మామూలు ఫ్లాట్లు కొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని లయాసిస్‌ ఫోరస్‌ సంస్థ ఎండీ పంకజ్‌ కపూర్‌ తెలిపారు. 

ముంబైలో రియల్‌ బూమ్‌ అధికంగా ఉండే ప్రభాదేవి, పరేల్‌, మహాలక్ష్మీ, లోయర్‌ పరేల్‌ వంటి ప్రాంతాల్లో స్క్వేయర్‌ ఫీట్‌ (ఎస్‌ఎఫ్‌టీ) ధర రూ. 25 వేల నుంచి రూ. 30 వేలకు తగ్గించినా వాటిని కొనేవారే కరువయ్యారని బిల్డర్లు వాపోతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని లయాసిస్‌ ఫోరస్‌ సంస్థ ఎండీ పంకజ్‌ కపూర్‌ చెప్పారు. కొనేవారు కరువవడంతో బిల్డర్లు సైతం నిర్మాణాలు తగ్గించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారికి మందగమనం సెగ తగులుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios