Asianet News TeluguAsianet News Telugu

ఆటోమొబైల్ క్రైసిస్: మూతపడుతున్న డీలర్స్ నెట్‌వర్క్.. ద్రవ్య లభ్యతే కారణమా?

లిక్విడిటీ క్రైసిస్‌తో ఆటోమొబైల్ పరిశ్రమలో కొనసాగుతున్న మందగమనం ప్రభావం, అస్థిరత వల్ల ఆయా కార్లు, ద్విచక్ర వాహనాల డీలర్ల నెట్ వర్క్‌పై పడింది. వెహికల్ సెల్సర్స్ అపెక్స్ బీడీ.. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ సంస్థల డీలర్ల షాపులు మూత పడుతున్నాయి. 

Auto dealers shut shop as sales slow
Author
Chennai, First Published Jul 6, 2019, 10:48 AM IST

చెన్నై: లిక్విడిటీ క్రైసిస్‌తో ఆటోమొబైల్ పరిశ్రమలో కొనసాగుతున్న మందగమనం ప్రభావం, అస్థిరత వల్ల ఆయా కార్లు, ద్విచక్ర వాహనాల డీలర్ల నెట్ వర్క్‌పై పడింది. వెహికల్ సెల్సర్స్ అపెక్స్ బీడీ.. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ సంస్థల డీలర్ల షాపులు మూత పడుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 18 నెలల్లో 245 ప్యాసింజర్ వెహికల్స్‌తోపాటు మొత్తం 271 డీలర్ షిప్‌ల షోరూమ్‌లు మూత పడ్డాయి. 

ముంబై నగరంలో 34, న్యూఢిల్లీలో 27, పుణెలో 24, చెన్నైలో 15 షోరూములు మూత పడ్డాయి. నిస్సాన్ కార్స్ షోరూములు 44, హ్యుండాయ్ కి చెందిన 39, రెనాల్ట్ ఆధ్వర్యంలోని 21, మహీంద్రా అండ్ అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ సంస్థలకు చెందిన 20 చొప్పున డీలర్ షిప్ షోరూములు మూత పడ్డాయని ‘ఫాడా’ తెలిపింది.

వీటిలో కొందరు డీలర్లు ఒకటికంటే ఎక్కువ షోరూములు నడుపుతున్నవీ ఉన్నాయి. ఆటో ఫైనాన్సియర్లు, డీలర్లు మాట్లాడుతూ ఆటోమొబైల్ పరిశ్రమలో అస్థిరత, మందగమనానికి కారణం వర్కింగ్ క్యాపిటల్ కింద రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఆచితూచి స్పందిస్తున్నాయన్నారు. ఫలితంగా ద్రవ్య లభ్యతను బ్యాంకర్లు టైట్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

ఆటో సేల్స్ మందగించడంతో కొందరు డీలర్లు తమ వద్ద ఉన్న నిధులను రియల్ ఎస్టేట్ రంగం వైపు మళ్లించడం కూడా షోరూముల మూసివేతకు మరొక కారణంగా కనిపిస్తున్నది. 44 డీలర్ షిప్ షోరూములను మూసివేశామన్న ‘ఫాడా’ ప్రకటనను నిస్సాన్ ఖండించింది. తాము కేవలం 25 డీలర్ షిప్ షోరూములను మాత్రమే మూసేశామని పేర్కొన్నారు. 

డీలర్ షిప్ షోరూముల మూసివేత విషయమై రెనాల్డ్ కూడా ‘ఫాడా’ స్టేట్‌మెంట్‌ను తప్పుబట్టింది. ఆటోమొబైల్ పరిశ్రమలో సర్దుబాట్ల ప్రక్రియలో భాగంగా నెట్ వర్క్ కరెక్షన్ జరుగుతుందన్నారు. మూత పడిన డీలర్ షిప్ షోరూముల్లో అత్యధికం చానెల్ పార్టనర్ల ఆర్థిక సమస్యల వల్లేనని పేర్కొంది. తమ నెట్ వర్క్‌ను బలోపేతం చేసుకోవడానికి నూతన మదుపర్లను ఆహ్వానిస్తున్నామని తెలిపింది. 

మారుతి సుజుకి, హ్యుండాయ్ సంస్థలు మాత్రం డీలర్ షిప్ షోరూముల మూసివేత విషయమై స్పందించేందుకు నిరాకరించాయి. షోరూములు మూతపడినా కొత్త షోరూములు ప్రారంభం అవుతున్నాయని మారుతి, హ్యుండాయ్ తెలిపాయి. గత 18 నెలల్లో 21 డీలర్లతో సంబంధాలు దెబ్బ తిన్నాయని టాటా మోటార్స్ తెలిపింది. కానీ అదనంగా 54 డీలర్ షిప్‌లను ప్రారంభించామని టాటా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సపోర్ట్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ఉపాధ్యక్షుడు సిబేంద్ర బర్మన్ తెలిపారు. 

ద్రవ్య లభ్యత సంక్షోభం కొనసాగుతున్నా, సేల్స్ తగ్గుముఖం పట్టినా ప్యాసింజర్ వెహికల్ కంపెనీలు తమ డీలర్ షిప్ నెట్ వర్క్ ఆర్థిక పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఐదు దక్షిణ భారత రాష్ట్రాల్లో ఐదు డీలర్ షిప్ లు మూత పడ్డాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం అధిపతి విజయ్ రామ్ నక్రా తెలిపారు. 

ప్యాసింజర్ వెహికల్స్ సంస్థలు టూ టైర్, త్రీ టైర్ మార్కెట్లలో విస్తరణపై కేంద్రీకరించడంతోనూ తాము సమస్యలను ఎదుర్కొంటున్నామని డీలర్లు అంటున్నారు. కార్ల తయారీ కంపెనీ భారతదేశంలో ఉత్పాదక ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. అటువంటప్పుడు ఒక్క డీలర్ రూ.60-80 కోట్ల మేరకు ఖర్చు చేస్తున్నాడని ఓ ఫైనాన్నియర్ తెలిపాడు. దీన్ని 200 డీలర్ షిప్‌లతో గణిస్తే ప్రభావం గణనీయంగానే ఉంటుందన్నాడు. బిజినెస్ పుంజుకుంటే మల్టీ నేషనల్ కంపెనీలు లబ్ధి పొందుతాయే తప్ప డీలర్లకు ఒరిగేదీ పెద్దగా ఏమీ ఉండదని, తాము ఇదంతా గమనిస్తూనే ఉంటామని ఆ ఫైనాన్సియర్ చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios