న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో వాహన విక్రయాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కేరళ వరదల దెబ్బకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుండాయ్‌ కార్ల అమ్మకాలు తగ్గాయి. టాటా, మహీంద్రా అమ్మకాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. ఆగస్టు నెలలో మారుతి సుజుకీ దేశీయంగా 1,47,700 యూనిట్ల కార్ల విక్రయాలు జరిపింది. 2017లో విక్రయించిన 1.52 లక్షలతో పోలిస్తే 2.8 శాతం తగ్గాయి. 

మారుతి సుజుకి కంపెనీకి చెందిన మినీ కాైర్లెన ఆల్టో, వ్యాగన్ ఆర్ 35,895 యూనిట్లు అమ్ముడవగా, కాంప్యాక్ట్ సెగ్మెంట్ స్విఫ్ట్, సెలేరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్‌లు ఏడాది ప్రాతిపదికన 3.6 శాతం తగ్గి 71.364 యూనిట్లకు పరిమితమయ్యాయి. యుటిలిటీ వాహనాలు 16 శాతానికి పైగా మందగించాయి. గత నెలలో ఎగుమతులు 10.4 శాతం తగ్గి 11,701 యూనిట్ల నుంచి 10,489 యూనిట్లకు చేరాయి. 

హ్యుండాయ్ మోటార్ అమ్మకాలు కూడా 2.8 శాతం పడిపోయి 45,801 యూనిట్లకు పరిమితమయ్యాయి. కానీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహహనాలకు డిమాండ్ ఊపందుకున్నది. గత నెలలో టాటా మోటార్స్ 18,420 యూనిట్ల విక్రయాలు జరిపింది. 2017 ఆగస్టు నెలలో అమ్మిన 14,340 యూనిట్లతో పోలిస్తే 28 శాతం వృద్ధి కనబరిచింది. ఇక ఎగుమతులు 25.8 శాతం పెరిగి 16,111 యూనిట్లకు చేరుకున్నాయి.

దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళతో కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ దెబ్బతిన్నదని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరేఖ్ తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 15 శాతం చొప్పున పెరిగి 45,373 యూనిట్లకు చేరుకున్నాయి. 

వివిధ కారణాలతో ఆటోమొబైల్ పరిశ్రమలో మందకోడి పరిస్థితులు నెలకొన్నాయని మహీంద్రా ప్రెసిడెంట్ ఆటోమోటివ్ రాజన్ వాధేరా తెలిపారు.కొన్ని బాహ్య అంశాల కారణంగా సెంటిమెంట్లపై ప్రభావం పడిందని, అందుకే ఆటో పరిశ్రమ ఆగస్టులో నిస్తేజంగా ఉందని ఎం అండ్‌ ఎం ఆటోమోటివ్‌ సెక్టార్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా తెలిపారు.

ఫోర్డ్ ఇండియా అమ్మకాల విషయానికి వస్తే ఏడాది ప్రాతిపదికన 31.18 శాతం పెరిగి 20,648 యూనిట్లకు చేరాయి. కంపెనీ ఎగుమతులు 58.30 శాతం పెరిగి 12,606 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో హోండా కార్ల విక్రయం స్వల్పంగా తగ్గి 17,020 యూనిట్లకు చేరింది. 

కేరళలో వరదలు, దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షాలు ఉండటం వల్ల అమ్మకాలపై ప్రభావం పడిందని హోండా కార్ల కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) రాజేష్‌ గోయల్‌ తెలిపారు. ఈ పండగల సీజన్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లను తెస్తున్నందు వల్ల అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

హిందుజా గ్రూపునకు చెందిన అశోక్ లేలాండ్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 27 శాతం ఎగబాకి 17,386 యూనిట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. అశోక్‌లేలాండ్‌ మొత్తం అమ్మకాలు ఆగస్టు నెలలో 27 శాతం పెరిగి 13,637 యూనిట్ల నుంచి 17,386 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ మీడియం అండ్‌ హెవీ కమర్షియల్‌ వాహనాల అమ్మకాల్లో 24 శాతం, లైట్‌ కమర్షియల్‌ వాహనాల విక్రయాల్లో 38 శాతం వృద్ధి నమోదైంది.

కార్లతోపాటు ద్విచక్ర వాహన విక్రయాలు కాస్త అనుకూలంగా ఉన్నాయి. టీవీసీ అమ్మకాలు రెండు శాతం పెరిగి 2,75,688 యూనిట్లకు చేరుకున్నాయి. సుజుకీ మోటార్‌సైకిళ్ల 31 శాతం వృద్ధితో 62,446 యూనిట్ల అమ్మకాలు జరిపింది. రాయల్ ఎన్‌ఫిల్డ్ అమ్మకాలు రెండు శాతం ఎగిశాయి.